
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఈసారి ఒకే దశలో నోటిఫికేషన్ ఇవ్వనుండటం గమనార్హం. ఆ ప్రకారం.. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు, ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఎన్నికలకు కేవలం 30 రోజుల స్వల్ప వ్యవధి మాత్రమే ఉంది. దీంతో ఇంతతక్కువ సమయంలో ఎన్నికలకు సమాయత్తం కావడం తమకు తలకు మించిన భారమేనని తెలంగాణ రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు.
బందోబస్తు, ఈసీతో సమన్వయం..
ఇంత స్వల్ప వ్యవధిలో సాధారణ శాంతి భద్రతలతోపాటు ఎన్నికల విధులు కూడా నిర్వర్తిం చాల్సి రావడంతో తాము పనిఒత్తిడికి గురవ్వాల్సి వస్తుందని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లతో పాటు అనుమానాస్పద వ్యక్తుల బైండోవర్లు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో నిఘా తదితర విధులు నిర్వ హించాలి. దీనికితోడు అక్రమ మద్యం, గుడుంబా, గంజాయి తదితర వాటిపై దృష్టి సారించాలి.మరో వైపు ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకో వడం, ఈవీఎంలు భద్రపరచడం, పోలింగ్ కేంద్రాల భద్రత, అభ్యర్థుల ప్రచారం, నామినేషన్ల పర్వం, సభలు తదితర విధులు వీరికి తలకు మించిన భారం కానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చివరి రోజు పోలింగ్ నిర్వహణ, ఈవీంల తరలింపు, భద్రపరచడం వంటివి మరో ఎత్తు కానున్నాయి.
కనీసం 25 వేల మంది బలగాలు కావాలి..
ప్రస్తుతమున్న పోలీసు బలగాలతో ఎన్నికల నిర్వహణ కష్టతరమే. వాటికి తోడుగా అదనపు బలగాలు తప్పనిసరి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి అదనపు బలగాలను రప్పించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వీటిని తెప్పించడం అన్నింటి కన్నా సులువుగా ఉండేది. కానీ, ఏపీకి కూడా తెలంగాణతోపాటే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఇపుడు కనీసం 20 వేల నుంచి 25 వేల వరకు అదనపు బలగాల అవసరం ఉంటుందని పోలీసుశాఖ అంచనావేస్తోంది. క్లిష్టతరమైన ఈ ఎన్నికల క్రతువును ఎలాంటి ఇబ్బందికర స్థితులకు తావులేకుండా నిర్వహించేందుకు వీలుగా ఆ శాఖ అధికారులు ప్రణాళిక రచించుకుంటున్నారు.