సాక్షి, అమరావతి: ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రతీ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 2,099 పార్టీలు రిజిష్టర్ చేసుకున్నాయి. ఇందులో 97 శాతం పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు లేదు. ఏడు జాతీయ పార్టీలు కాగా, 58 రాష్ట్ర పార్టీలు. ఈ 97 శాతం పార్టీల్లో అత్యధిక పార్టీలు మనీలాండరింగ్‌కు, పన్నుల ఎగవేతకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే రిజిస్టర్ అయిన పార్టీల్లో అత్యధిక శాతం ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వర్తించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఎంతో కాలంగా ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తూ వస్తోంది. కొన్ని పార్టీల విషయంలో పన్నుల ఎగవేత ఆరోపణలు నిరూపితమయ్యాయి.
బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని, రాస్తారోకోలు నిర్వహించిన సీపీఎంకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ రిజిస్ట్రేషన్(డీ రిజిస్టర్) ఎందుకు చేయరాదో తెలిపాలని ఆదేశించింది. దీనిపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు 2002లో తీర్పునిస్తూ పార్టీల రిజిస్టర్‌కు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని, అయితే డీ రిజిస్టర్ చేసేందుకు మాత్రం అధికారం లేదని స్పష్టం చేసింది.
ఒక పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత, తిరిగి దానిని పునఃసమీక్షించే అధికారం చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని డీ రిజిస్టర్ చేయడమన్నది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. 2010లో ఎన్నికల సంఘం మరోసారి పార్టీల డీ రిజిస్టర్ విషయంలో తమకు అధికారాలు ఇవ్వాలని కోరింది. ఆ మేర చట్ట సవరణ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఎన్నికల సంఘం, పార్టీల డీ రిజిస్టర్‌కు తమకు అధికారాన్ని ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరింది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment