ఏలూరులో బారులు తీరిన ఓటర్లు (ఫైల్) .
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఈవీఎంలు పనిచేయలేదు.. ఏ ఓటు ఎటు వెళ్లిందో’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మేధావులు, న్యాయవాదులు, సామాన్య ఓటర్లు అంటున్నారు. ఈవీఎంలు కొన్నిచోట్ల మొరాయించిన మాట వాస్తవమే. అటువంటి చోట్ల రాత్రి వరకూ పోలింగ్ జరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు దిగింది. ఈవీఎంల పనితీరుపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం, వాటిని ఆపరేట్ చేయడం రాకపోవడం వల్ల అవి మొరా యించాయి. చాలా వాటిలో సాంకేతిక సమస్యలు లేవని, సరిగా ఆపరేట్ చేయడం తెలియకపోవడం వల్లే సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల గంట ఆలస్యంగా మొదలైనాపోలింగ్‌ను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకూ పొడిగించిన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా పోయాయి. కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకూ పోలింగ్ జరిగింది.
వీవీ ప్యాట్‌లో స్పష్టంగా..
ఒక పార్టీ గుర్తుపై ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్లిందంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను న్యాయవాదులు కొట్టివేస్తున్నారు. ఎవరికి ఓటు వేసింది పక్కనే ఉన్న వీవీ ప్యాట్‌లలో ఏడు సెకన్లపాటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ తాము వేసిన గుర్తుకు కాకుండా మరోదానికి పడి ఉంటే ఓటర్లు చూస్తూ ఊరుకోరు. జిల్లాలో ఓటు ఒకరికి వేస్తే మరొకరికి వెళ్లిందన్న ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు ఓటు వేసి పక్కనే ఉన్న స్క్రీన్‌ను ఆసక్తిగా చూశాను నేను ఏ పార్టీకి ఓటు వేశానో ఆ పార్టీకే ఓటు పడిందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాన్ చెబుతున్నారు.
అవగాహనలేమితోనే ఇబ్బందులు
కొవ్వూరులో ఎన్నికల వి ధులు నిర్వహించిన ఒక ఉద్యోగి ‘సాక్షి’తో మాట్లాడుతూ మా కేంద్రంలో మాక్‌పోల్‌లో ఈవీఎం ఇబ్బంది పెట్టినా కొద్దిసేపటి తర్వాత వాటి పనితీరు మెరుగుపడిందన్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని వారు ఏ గుర్తుకు ఓటు వేశారో చూసుకుని మరీ వెళారన్నారు. ఈవీఎంల ద్వారా శబ్ధం, వీవీ ప్యాట్‌ల ద్వారా చిత్రం పక్కాగా వచ్చాయని, వాటిలో లోపాలు లేవన్నారు. అవగాహనా లోపమే కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని విద్యాధికులు చెబుతున్నారు.
ఓటమి భయంతోనే ఇలా..
టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఈవీఎం టెక్నాలజీౖపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని ఒక ఉద్యోగి అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు పనిచేయలేదన్న ఆరోపణలు నిజమైతే జిల్లాలో 82.20 శాతం ఓటింగ్ ఎలా నమోదు అవుతుందని, కొవ్వూరు, నిడదవోలు, ఉంగుటూరు వంటిచోట్ల 86 నుంచి 87 శాతం ఓటింగ్ ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఓటమికి సాకులు వెతకడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై, ఎన్నికల సంఘం అధికారులపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా..
2014లో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు 2019లో ఎందుకు పనిచేయవని వారు ప్రశ్నిస్తున్నారు. 2014లో ఈవీఎంలు ఉపయోగించి కేవలం 2 శాతం స్వల్ప తేడాతో గెలిచినపుడు ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదని పౌరహక్కుల సంఘం నేత నంబూరి శ్రీమన్నారాయణ ప్రశ్నించారు. తాను గెలిస్తే బాగా పనిచేసినట్లు, లేకపోతే పనిచేయలేదనే వైఖరి సరికాదన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా, కించపరిచేలా మాట్లాడే నైజం చంద్రబాబుదని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కమ్ముల పెద్దిరాజు విమర్శించారు. కుటుంబ సమ్మేతంగా ఓటు వేసి బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి తెల్లవారిన తర్వాత మెషీన్లు పనిచేయడం లేదని చెప్పడం ఏమిటి? అని రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఒకరు విమర్శించారు.
క్యూలైన్‌లో సాయంత్రం ఆరుగంటల తరువాత ఎంత మంది ఉంటే అంత మంది చేత ఓట్లు వేయిస్తారనే విషయం కూడా తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయనలో ఓడిపోతున్నామనే భయం పట్టుకుందని ఒక లెక్చరర్ అభిప్రాయపడ్డారు. మహిళలు కూడా రాత్రి తొమ్మిది గంటల వరకూ ఉండి మరీ ఓటేశారంటే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అయి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు వరకూ వారిని జన్మభూమి కమిటీల పేరుతో వేధించి, ప్రభుత్వ సభలకు బలవంతంగా తరలించి, ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో డబ్బులు వేస్తే అది అర్థం చేసుకోలేని స్థితిలో మహిళలు లేరని వారు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment