Voting for women
-
బాబూ.. ఇదేమి డాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఈవీఎంలు పనిచేయలేదు.. ఏ ఓటు ఎటు వెళ్లిందో’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మేధావులు, న్యాయవాదులు, సామాన్య ఓటర్లు అంటున్నారు. ఈవీఎంలు కొన్నిచోట్ల మొరాయించిన మాట వాస్తవమే. అటువంటి చోట్ల రాత్రి వరకూ పోలింగ్ జరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు దిగింది. ఈవీఎంల పనితీరుపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం, వాటిని ఆపరేట్ చేయడం రాకపోవడం వల్ల అవి మొరా యించాయి. చాలా వాటిలో సాంకేతిక సమస్యలు లేవని, సరిగా ఆపరేట్ చేయడం తెలియకపోవడం వల్లే సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల గంట ఆలస్యంగా మొదలైనాపోలింగ్ను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకూ పొడిగించిన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా పోయాయి. కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకూ పోలింగ్ జరిగింది. వీవీ ప్యాట్‌లో స్పష్టంగా.. ఒక పార్టీ గుర్తుపై ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్లిందంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను న్యాయవాదులు కొట్టివేస్తున్నారు. ఎవరికి ఓటు వేసింది పక్కనే ఉన్న వీవీ ప్యాట్లలో ఏడు సెకన్లపాటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ తాము వేసిన గుర్తుకు కాకుండా మరోదానికి పడి ఉంటే ఓటర్లు చూస్తూ ఊరుకోరు. జిల్లాలో ఓటు ఒకరికి వేస్తే మరొకరికి వెళ్లిందన్న ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు ఓటు వేసి పక్కనే ఉన్న స్క్రీన్‌ను ఆసక్తిగా చూశాను నేను ఏ పార్టీకి ఓటు వేశానో ఆ పార్టీకే ఓటు పడిందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాన్ చెబుతున్నారు. అవగాహనలేమితోనే ఇబ్బందులు కొవ్వూరులో ఎన్నికల వి ధులు నిర్వహించిన ఒక ఉద్యోగి ‘సాక్షి’తో మాట్లాడుతూ మా కేంద్రంలో మాక్‌పోల్‌లో ఈవీఎం ఇబ్బంది పెట్టినా కొద్దిసేపటి తర్వాత వాటి పనితీరు మెరుగుపడిందన్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని వారు ఏ గుర్తుకు ఓటు వేశారో చూసుకుని మరీ వెళారన్నారు. ఈవీఎంల ద్వారా శబ్ధం, వీవీ ప్యాట్ల ద్వారా చిత్రం పక్కాగా వచ్చాయని, వాటిలో లోపాలు లేవన్నారు. అవగాహనా లోపమే కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని విద్యాధికులు చెబుతున్నారు. ఓటమి భయంతోనే ఇలా.. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఈవీఎం టెక్నాలజీౖపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని ఒక ఉద్యోగి అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు పనిచేయలేదన్న ఆరోపణలు నిజమైతే జిల్లాలో 82.20 శాతం ఓటింగ్ ఎలా నమోదు అవుతుందని, కొవ్వూరు, నిడదవోలు, ఉంగుటూరు వంటిచోట్ల 86 నుంచి 87 శాతం ఓటింగ్ ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఓటమికి సాకులు వెతకడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై, ఎన్నికల సంఘం అధికారులపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా.. 2014లో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు 2019లో ఎందుకు పనిచేయవని వారు ప్రశ్నిస్తున్నారు. 2014లో ఈవీఎంలు ఉపయోగించి కేవలం 2 శాతం స్వల్ప తేడాతో గెలిచినపుడు ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదని పౌరహక్కుల సంఘం నేత నంబూరి శ్రీమన్నారాయణ ప్రశ్నించారు. తాను గెలిస్తే బాగా పనిచేసినట్లు, లేకపోతే పనిచేయలేదనే వైఖరి సరికాదన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా, కించపరిచేలా మాట్లాడే నైజం చంద్రబాబుదని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కమ్ముల పెద్దిరాజు విమర్శించారు. కుటుంబ సమ్మేతంగా ఓటు వేసి బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి తెల్లవారిన తర్వాత మెషీన్లు పనిచేయడం లేదని చెప్పడం ఏమిటి? అని రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఒకరు విమర్శించారు. క్యూలైన్లో సాయంత్రం ఆరుగంటల తరువాత ఎంత మంది ఉంటే అంత మంది చేత ఓట్లు వేయిస్తారనే విషయం కూడా తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయనలో ఓడిపోతున్నామనే భయం పట్టుకుందని ఒక లెక్చరర్ అభిప్రాయపడ్డారు. మహిళలు కూడా రాత్రి తొమ్మిది గంటల వరకూ ఉండి మరీ ఓటేశారంటే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అయి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు వరకూ వారిని జన్మభూమి కమిటీల పేరుతో వేధించి, ప్రభుత్వ సభలకు బలవంతంగా తరలించి, ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో డబ్బులు వేస్తే అది అర్థం చేసుకోలేని స్థితిలో మహిళలు లేరని వారు అంటున్నారు. -
‘ఓటు’లో పురుషాధిక్యం
ట్రెండ్ మారింది జిల్లాలో 49 శాతం మహిళల ఓటింగ్ 51 శాతం పురుషుల ఓటింగ్ ఏడు నియోజకవర్గాల్లోనే మహిళల ఓటింగ్ అధికం నగరంలో మాత్రం పురుషులదే పై చేయి సాక్షి, విజయవాడ : జిల్లాలో ట్రెండ్ మారింది. సీమాంధ్రలో అత్యధిక జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకొని నిర్ణయాత్మకశక్తిగా అవతరించారు. కాని జిల్లాలో పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నా పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంది మాత్రం తక్కువే. అదికూడా పురుష ఓటర్ల కంటే కేవలం ఒక్క శాతం తక్కువగా మహిళ ఓటర్లు ఓటు వేశారు. జిల్లాలో సగటున 51 శాతం పురుషుల ఓటింగ్ నమోదు కాగా సుమారుగా 49 శాతం మహిళల ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా గుడివాడ, జగ్గయ్యపేటలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 33,37,071 మంది ఓటర్లకుగాను సార్వత్రిక ఎన్నికల్లో 26,76,149 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 78.34 శాతంగా పోలింగ్ నమోదైంది. వీరిలో 13,42,052 మంది పురుషులు, మహిళలు 13,34,081 మంది ఓటు వేశారు. అంటే జిల్లాలో పురుష ఓటర్లే కీలకంగా మారారు. 7,971 మంది పురుషులు మహిళల కంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలు మినహా 13 నియోజకవర్గాల్లో అత్యధికంగా 7 నియోజకవర్గాలలో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారారు. గుడివాడ నియోజకవర్గంలో అత్యధికంగా 3,606 మంది మహిళలు, జగ్గయ్యపేటలో 2,383, గన్నవరంలో 1,989, మచిలీపట్నంలో 1787, పామర్రులో 1024, పెనమలూరులో 898, నందిగామలో 1,463 మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా నూజివీడు నియోజకవర్గంలో 87 శాతం పోలింగ్ నమోదవగా పురుషులదే పైచేయిగా ఉంది. నగరంలో పురుషుల హవా... విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారి అత్యధిక శాతం మంది ఓటు హక్కున వినియోగించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 6,150 మంది పురుషులు, సెంట్రల్లో 1,825 మంది, తూర్పు నియోజకవర్గంలో 2,659 మంది పురుషులు మహిళలకంటే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నగరంలో మహిళల ఓటింగ్ తగ్గటం పోలింగ్ శాతంపై తీవ్రంగా ప్రభావం చూపింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సగటున 75 శాతం పోలింగ్ నమోదయితే నగరంలో మాత్రం సగటున 66 శాతం మాత్రమే నమోదైంది. జిల్లాలో 6.60 లక్షల మంది ఓటింగ్‌కు దూరం జిల్లాలో సగటున 78.34 పోలింగ్ శాతం నమోదయింది. జిల్లాలో మొత్తం 33,37,071 మంది ఓటర్లకు ఈసారి 26,76,149 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 6,60,922 మంది ఓటింగ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నారు. గుడివాడలో సుమారు 40 వేల మందికిపైగా, నూజివీడులో సుమారు 27 వేల మందికి పైగా, మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 20 నుంచి 25 వేల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని ప్రతి నియోజకవర్గంలోనూ సగటున 60 నుంచి 80 వేల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.