రామాంజనేయులు యాదవ్
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. పదవీవిరమణ అనంతరం తమ బతుకులను రోడ్డు పాలుచేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతున్న సీపీఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలెల రామాంజనేయులు యాదవ్‌ను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది.
ఈ మేరకు అనంతపురం జిల్లా విద్యాధికారి ద్వారా హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు కొందరి చేత ‘సీవిజిల్’ ద్వారా ఫిర్యాదు చేయించి బీసీ నాయకుడైన రామాంజనేయులు యాదవ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈయన అనంతపురం జిల్లా తనకళ్లు మండలం బొంతలపల్లి జడ్పీ హైస్కూల్‌లో హిందీపండిట్‌గా పనిచేస్తున్నారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా ఉద్యోగులకు న్యాయం చేయడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై రామాంజనేయులు యాదవ్ హర్షం వ్యక్తం చేయడంతో కక్ష కట్టిన ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయించింది.
అశోక్‌బాబుకో రూలు.. మాకో రూలా?
‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు చేసే మాట వైఎస్ జగన్ చెబితే అభినందించాను. అంత మాత్రాన నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారా? మరి గతంలో అశోక్‌బాబు ఏకంగా చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నారే.. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఆయనకో రూలు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాకో రూలా?’ అని ఏపీ సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.
ఉద్యోగుల హక్కులను అణగదొక్కడమే...
సీపీఎస్ రద్దుపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నందుకు తనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం ఉద్యోగుల హక్కులను, అభిప్రాయాల వ్యక్తీకరణను, ఉద్యమాలను అణగదొక్కడమేనని రామాంజనేయులు యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనకబడిన కులాలకు చెందిన వ్యక్తులను అవమానించడమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, ఒక ఉద్యమ నేతగా తన అభిప్రాయాన్ని చెప్పినందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయమని ఖండించారు.
చంద్రబాబుకు గుణపాఠం తప్పదు
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండు చేసిన పాపానికి రామాంజనేయులు యాదవ్‌ను సస్పెండ్ చేయడాన్ని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ జాతీయ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment