సాక్షి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమైంది. ఆ పార్టీ నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి చెందిన పీసీసీ డెలిగేట్ సుభాష్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేసిన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో ఆయన పదవీచ్యుతుడు కావడంతో రెండేళ్ల కాలపరిమితి కోసం ఎన్నిక జరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ పారీ్టలో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో దిగాలని ఇటీవల జరిగిన సమా వేశంలో నిర్ణయించింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మానాల మోహన్‌రెడ్డితో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన సుభాష్‌రెడ్డి పేర్లను ఆ పార్టీ నాయకత్వం పరిశీలించింది. అయితే సుభాష్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేయడంతో ఆయన సోమవారం నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. పత్రాలను సిద్ధం చేసిన తరువాత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయమై సుభాష్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా పార్టీ నిర్ణయం మేరకు తాను పోటీకి సిద్ధమైనట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు దాదాపు 150 మంది ఉండడం, వారితో పాటు మరికొన్ని ఓట్లు సంపాదించి పార్టీ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయతి్నస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపుతున్నారని భావిస్తున్నారు.
టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న ఆశావహులు
అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి పలువురు నేతలు ఆసక్తి చూపగా, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కచ్చితమైన హామీ లభించినట్లు సమాచారం. దీంతో ఆయన నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. కామారెడ్డికి చెందిన టీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన మాజీ ఎంపీ కవిత, కేటీఆర్‌లను కలిసి విన్నవించారు. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మూడు రోజులుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని విన్నవించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థిని ప్రకటించే విషయంలో టీఆర్‌ఎస్ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. నామినేషన్ల దాఖలుకు ఒకరోజు ముందు అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment