
సాక్షి, కడప : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. తటస్థంగా ఉండాలి. పార్టీల పట్ల తమ భావాలను వ్యక్తం చేయకూడదు. ఆఖరుకు సామాజిక మాధ్యమాల్లో కూడా. ప్రచారం చేయకూడదు. ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడా ప్రచారాల్లో పాల్గొనకూడదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులందరూ ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు. వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని కొందరు ‘పచ్చ’ఉద్యోగులు ప్రభుత్వ సేవకులమనే విషయం మరిచిపోతున్నారు. వ్యక్తులు, పార్టీలను ఆరాధిస్తూ తరిస్తున్నారు. మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. ఎన్నికల నియమావళి రావడంతో మంత్రులు సైతం సాధారణ పౌరులుగా ఉంటారు.
ప్రొటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధులు సైతం సొంత వాహనాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహించిన మత్స్య శాఖలో అధికారిగా పనిచేసే నెల్లూరు రెడ్డయ్య మాత్రం ఇప్పటికీ మంత్రి సేవలోనే తరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదినారాయణరెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. టీడీపీ ఎన్నికల కార్యాలయంలో ఓటర్ల పరిశీలన, ఓటర్లకు ఫోన్లు చేయడం, వారిని ప్రలోభాలకు గురిచేయడం, టీడీపీకి అనుకూలంగా పనిచేయాలంటూ కోరడం లాంటి విషయాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఈ అధికారిపై ఎన్నికల అధికారులు ఏం చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిత్యం రాజకీయ పార్టీ ప్రచారంలో తరిస్తున్నారు. ముద్దనూరులో ఇరిగేషన్ ఏఈ కటిక మధుసూదనరెడ్డి, చింతకొమ్మదిన్నెలో ఏఈ ఖాశీంసాబ్‌ల వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా మత్య్యశాఖ అధికారి వ్యవహారం వెలుగుచూసింది. నిబంధనల మేరకు చర్యలుంటే మరో అధికారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు కట్టడి చేయివచ్చు.
Comments
Please login to add a commentAdd a comment