కడప సెవెన్‌రోడ్స్ : సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యూనరేషన్ చెల్లింపులో వ్యత్యాసాలు చోటుచేసుకోవడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తాన్ని కాకుండా కొంత డబ్బులు కోత విధించి మిగతా మొత్తాన్ని జిల్లా ఉన్నతాధికారులు స్వాహా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ విషయంలో తమకు రావాల్సిన మిగతా మొత్తం డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. శాసనమండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డితో పాటు పలువురు ఈ అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతులు సమర్పించారు.
ఒక్కోచోట ఒక్కో విధంగా..
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 11వ తేది ముగిసింది. పోలింగ్ నిర్వహణ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులను వినియోగించుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1+5 చొప్పున నియమించారు. మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, బీఎల్‌ఓలు, వీడియోగ్రాఫర్లు, వెబ్ కాస్టింగ్ క్రో కాకుండా కేవలం ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, రిజర్వుతో కలిపి 18788 మందిని నియమించారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు రూ. 7,31,40,000 వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ నెంబరు 28435, 02.04.2019 ప్రకారం ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లింపులో సమతుల్యత పాటించాలి. అయితే అందుకు భిన్నంగా ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో విధంగా రెమ్యూనరేషన్ ఇచ్చారని అంటున్నారు. మైదుకూరు, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పీఓలకు రూ. 1400, ఏపీఓలకు రూ. 1000, ఓపీఓలకు రూ. 750 చెల్లించారని తెలిసింది. జమ్మలమడుగులో రూ.1700, 1300, 1050 చొప్పున చెల్లించారు. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే పక్కన ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పీఓకు రూ. 2400, ఏపీఓకు రూ. 2400, ఓపీఓకు రూ. 1500 చొప్పున చెల్లించారు. అనంతపురం జిల్లాలో పీఓలకు రూ. 2200, ఏపీఓలకు రూ.1700 చెల్లించినట్లు తెలుస్తోంది. ఈనెల 10, 11 తేదీల్లో విధుల్లో పాల్గొన్న ఇతర పోలింగ్ అధికారులు వంద కిలోమీటర్ల పైబడి దూరమున్న ప్రాంతాల్లో కూడా విధులు నిర్వర్తించారు.ఈనెల 11వ తేది రాత్రి పోలింగ్ ముగిశాక బస్సులు లేకపోవడం వల్ల మరుసటి రోజుకు గానీ అనేకమంది తమ గమ్యస్థానాలకు చేరలేదు. వీరికి ఓడీ ప్రకటించడం సమంజసమేనని, అయితే తమకు కూడా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తాన్ని అందించాలని జిల్లా ఎన్నికల అ«ధికారికి పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment