
జీవీఎంసీ కార్యాలయం
సార్వత్రిక సమరం ముగిసింది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విశాఖలో మరో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అదే మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు. స్థానిక పాలన లేకుండా ఎనిమిదేళ్లుగా నగరాన్ని అనాథని చేసిన చంద్రబాబు సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఆరు నెలల్లోగా వార్డుల విభజన పూర్తి చేసిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విశాఖ సిటీ: ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికల వేడితో హీటెక్కిన విశాఖ నగరం.. ఎన్నికలు పూర్తయి చల్లబడేలోపు మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కేందుకు సిద్ధమవుతోంది. బిగ్ ఫైట్ పూర్తవ్వగానే.. అంతా లోకల్ ఫైట్ కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిదిన్నరేళ్లుగా స్థానిక సమరం కోసం ఎదురు చూసిన ప్రజలకు మరో ఆరు నెలల్లో ఆ ఎన్నికలు రానున్నాయి.
అనాథగా ఎనిమిదేళ్లు
గ్రేటర్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణితో.. తప్పించుకు తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం ఎనిమిదిన్నరేళ్లు గడిపేసింది. పాలక వర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారి పాలనలోనే ప్రస్తుతం మహా విశాఖ నగర పాలక సంస్థ నడుస్తోంది. గత పాలక వర్గం కాలపరిమితి 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించలేదు. మూడు నెలల క్రితం ప్రత్యేకాధికారి పాలన కాలపరిమితి మరో ఆరు నెలలు పొడిగిస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేసింది.
వార్డుల విభజనతో ఆగిన ఎన్నికలు
2005లో కార్పొరేషన్‌ను మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)గా మారుస్తూ అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకూ ఉన్న 50 వార్డులు 72కి చేరుకున్నాయి. గాజువాక, మధురవాడ, పెందుర్తి ప్రాంతాలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. ఆ తర్వాత 72 వార్డులతో 2007లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా.. ఈ పాలకవర్గ గడువు 2012 ఫిబ్రవరి 26తో ముగిసిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేసింది. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలను జీవీఎంసీలో విలీనం చెయ్యాలనే ప్రతిపాదన రావడంతో ఎన్నికలకు ఫుల్‌స్టాప్ పడింది. 2013లో ఈ రెండు మున్సిపాలిటీలను జీవీఎంసీలో విలీనం చేస్తూ.. ప్రభుత్వం జీవో నం.375ని విడుదల చేసింది. దీని ప్రకారం వార్డుల పునర్విభజన చేసి 83 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాల్ని ఆశ్రయించడంతో పునర్విభజన ప్రక్రియకు చుక్కెదురైంది. కాకినాడ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలోనూ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం.. జీవీఎంసీ ఎన్నికలపైనా అదే తీర్పు వస్తుందనే భయంతో వార్డుల పునర్విభజన ప్రక్రియకు మరోసారి శ్రీకారం చుడుతూ ఎలాంటి ప్రణాళిక లేకుండా జీవో జారీ చేసేసింది. ప్రస్తుతం ఉన్న 72 వార్డుల్ని 81కి పెంచుతూ 2017 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. దానికి సంబంధించిన చిన్న అడుగు కూడా ఇంత వరకూ వెయ్యలేదు. సరికదా.. జీవో ప్రకారం చేస్తే వార్డుల విభజన ప్రక్రియ అస్తవ్యస్తమవుతుందంటూ జీవీఎంసీ రాసిన లేఖకు కూడా సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసేసింది.
ఎన్నికలు నిర్వహించకపోతే చూస్తూ ఊరుకోం: హైకోర్టు
చంద్రబాబు సర్కారు ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకున్న వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ పూర్తయింది. కాలపరిమితి ముగిసి ఇన్నేళ్లు గడిచిపోయినా జీవీఎంసీకి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటూ హైకోర్టు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకెంత కాలం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2017లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ పూర్తి చేసింది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు వంటి అంశాలను 60 రోజుల్లో పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించాలని వారం కిందట ఆదేశాలు జారీ చేసింది. ఇదే చివరి అవకాశమని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం వార్డుల ప్రక్రియ పూర్తి చేసేందుకు హడావిడి ప్రారంభించింది. జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన జీవీఎంసీ.. వార్డుల పునర్విభజన ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మహా విశాఖ మ్యాప్‌లతో పాటు కొత్తగా విలీనం చేసిన పంచాయతీల భౌగోళిక చిత్రపటాల్ని సేకరించే పనిలో పడ్డారు. వాటిని పూర్తి స్థాయిలో సేకరించాక ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే విభజన మ్యాపింగ్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు చెబుతున్నారు.
హైకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు
ఎనిమిదేళ్లుగా జీవీఎంసీకి కౌన్సిల్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు సైంధవులుగా వ్యవహరించారు. మరో అధికార కేంద్రం ఏర్పడుతుందనే భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు గ్రహణం పట్టించారు. ఎన్నికలు నిర్వహిస్తే మేయర్, కార్పొరేటర్లకు ప్రాధాన్యం పెరుగుతుందని వారి భయం. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. కాబట్టి గ్రేటర్ విశాఖకు మంచిరోజులు రానున్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు. – పల్లా చిన్నతల్లి, జీవీఎంసీ మాజీ కౌన్సిలర్
విశాఖ బాగు కోసమే పిల్ వేశాను..
స్థానిక పాలన లేకపోవడంతో చిన్న చిన్న రోడ్లు వెయ్యాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. కార్పొరేటర్ల వ్యవస్థ లేకపోవడంతో ఎమ్మెల్యేలే నియంతల్లా గ్రేటర్‌ను ఏలారు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాను. హైకోర్టు దీనిపై స్పందించి ఎన్నికలపై స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉంది. గ్రేటర్‌లో ఎన్నికలు జరగకపోవడంతో ఇప్పటికే రూ. 200 కోట్లు జీవీఎంసీ నష్టపోయింది.– కె. గోపాలరెడ్డి, పిల్ దాఖలు చేసిన వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment