
కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
విజయనగరం ,జియ్యమ్మవలస : గిరిజనేతరులతో గిరిజన సలహా సంఘంను నియమించడం దారుణమని, గిరిజనాభివృద్ధిని పక్కతోవ పట్టించడానికే ఇలాంటి సలహా సంఘం నియమించారని కురపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. చినమేరంగి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారం చేపట్టిన మూడున్నరేళ్లకు సీఎం చంద్రబాబుకు గిరిజన సలహా సంఘం గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. మన్యంలో ఉండే బాక్సైట్‌ను తవ్వుకునేందుకే గిరిజనేతరులతో కమిటీని నియమించారని ఆరోపించారు.
గిరిజనుల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి పార్టీల కతీతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది గిరిజన సభ్యులతో జీవో నంబర్ 84 ప్రకారం కమిటీని నియమించారన్నారు. గిరిజన సలహా సంఘం కమిటీలో మూడు వంతులు గిరిజనులు ఉండాల్సి ఉండగా అటువంటి నియమాలు పాటించలేదన్నారు. గిరిజన ప్రజల అభివృద్ధిని కాంక్షించేవారితో కాకుండా.. టీడీపీలో ఓడిపోయిన వారికి సలహా సంఘంలో స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలోని ఏడు గిరిజన అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురు వైఎస్సార్ సీపీకి చెందిన అభ్యర్థులు గెలిచారన్నారు. గిరిజన శాఖామంత్రిగా గిరిజనేతరుడైన నక్కా ఆనందబాబును నియమించి గిరిజన సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు. ప్రస్తుతం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియమించిన సలహాసంఘంను రద్దుచేసి గిరిజనులకు సంఘంలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.