తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్రం సాధించే స్థాయికి చేరుకోవడానికి కీలక సూత్రధారి ఆయన. ఈయన విసిరిన ఒకే ఒక్క సవాల్.. కేసీఆర్ ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా మారడానికి కారణమైంది. ఆ సవాలే ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ను దూరం చేసింది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఆయన మాటకు అంతటి పవర్.. ఉన్నదున్నట్లు మాట్లాడే కచ్చితత్వం ఆయన సొంతం. నోటి మాటతో ఎక్కువగా స్వపక్షాన్నే ఇబ్బంది పెట్టిన విలక్షణ నాయకుడు. ఆయనే సంచలనాల సత్తెన్న. ఎమ్మెస్సార్‌గా పిలిచే మెన్నేని సత్యనారాయణరావు.- వొద్దమల్ల విజయభాస్కర్, కరీంనగర్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన సత్యనారాయణరావు రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత. పార్టీ, ప్రభుత్వ పదవులను అవలీలగా నిర్వహించిన ఘననేత. ఆరు రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన అనుభవం ఆయనది. నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్‌గాంధీ వరకు మూడు తరాల నాయకత్వంలో పనిచేసిన ఏకైక నేత. పైకి ఒకలా.. లోపల మరోలా మాట్లాడడం ఆయనకు తెలియదు. గవర్నర్ కావాలనే ఒక్క కోరిక మాత్రం మిగిలి ఉందని బాహాటంగానే చెప్పేవారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసు లాఠీదెబ్బలు తిన్నారు. కానీ 2006లో మాత్రం ‘తెలంగాణ అంటే చెప్పుతో కొడతా’నన్నారు. ఆ మాట వివాదాస్పదమైనా.. అలా అనగలగడం ఆయనకే చెల్లింది. అదే ఎమ్మెస్సార్ స్టైల్.
నాటి యూత్ లీడర్
ఎమ్మెస్సార్ సంక్రాతి రోజున పుట్టారు (1934, జనవరి 14న). ఎమ్మెస్సార్, రెండు పదుల వయస్సులోనే రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 1954 నుంచి 1969 వరకు విద్యార్థి, యువజన కాంగ్రెస్‌లో కీలక పాత్ర నిర్వర్తించారు. 1969 నుంచి 1971 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. జైలుకు కూడా వెళ్లారు. 1971లో కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన ఎమ్మెస్సార్ ఇక ఆ పదవిని వదలలేదు. వరుసగా 14 ఏళ్ల పాటు, 1985 వరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ సమయంలోనే ఇందిరాగాంధీ నాయకత్వంలో 1980 నుంచి 1983 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత ఆయన దృష్టి కేంద్రం నుంచి రాష్ట్రం వైపు మరలింది. 1990లో తొలిసారి ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులై, ఆ పదవిలో 1994 వరకు కొనసాగారు. 2000లో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. 2004 సాధారణ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన, ఆ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి గెలిచి 2004 నుంచి 2007 వరకు మంత్రిగా కొనసాగారు. కేసీఆర్‌కు విసిరిన సవాల్ కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఖాళీగా లేరాయన. సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆర్టీసీ చైర్మన్‌గా పూర్తి కాలం పదవిలో కొనసాగి.. అటు సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీల చేత ఔరా అనిపించుకున్నారు.
ఆ సవాల్.. పెను ఉప్పెన
రాజకీయ రంగంలో ఉంటూ ‘తాను చెప్పదలుచుకున్న విషయాన్ని లౌక్యంగా చెప్పడం’ అనే ప్రాథమిక లక్షణాన్ని మాత్రం ఒంటపట్టించుకోలేదు ఎమ్మెస్సార్. ఎప్పుడూ ఏదో మాటతో సంచలనాలకు కారణమయ్యేవారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పోటీచేయగా, కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెస్సార్, లోక్‌సభ నుంచి కేసీఆర్ గెలుపొందారు. ఆ తరువాత కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కొంచెం నెమ్మదించినట్లు ఉండింది. అప్పుడు ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘కేసీఆర్ మంత్రి పదవి తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని పడుకోబెట్టిండు. కాంగ్రెస్‌తోనే పదవి వచ్చింది. రాజీనామా చేసి తిరిగి గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా’’నంటూ సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్య సంచలనమైంది. దీనికి తీవ్రంగా స్పందించిన కేసీఆర్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలోనే కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో ‘తెలంగాణ అంటే చెప్పుతో కొడుతా’నంటూ ఓ టీఆర్‌ఎస్ నాయకునిపై ఎమ్మెస్సార్ విరుచుకుపడి కలకలం సృష్టించారు. చివరకు కేసీఆర్ రికార్డు స్థాయి మెజార్టీ సాధించడంతో.. మాటకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ చరిత్రలో రెండు లక్షల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన కేసీఆర్.. ఢిల్లీ గద్దెపై ఉన్న పెద్దల దృష్టిని ఆకర్షించారు. ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ ప్రభావం రెట్టింపైంది. చివరకు రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది.
కాంగ్రెస్‌పై గెలుపు
ఎమ్మెస్సార్ కరీంనగర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల జగపతిరావుపై 56,323 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి బీఎల్‌డీ అభ్యర్థి జువ్వాడి గౌతమ్‌రావుపై 1,14,488 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావుపై 1,56,328 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి దేవాదాయ శాఖ మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్‌గా కొనసాగారు.
పట్టుపట్టిండంటే..
ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఆర్టీసీ చైర్మన్, పీసీసీ చీఫ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వంటి ఎన్నో పదవులను అలంకరించి రాజకీయాల్లో సీనియర్ అయిన ఎమ్మెస్సార్ పట్టుపట్టిండంటే, అది జరగాల్సిందే. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలవతో కొద్ది నెలల్లోనే రెండోసారి ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీపై తనదే ఆధిపత్యం ఉండాలని, ఎవరూ జోక్యం చేసుకోరాదనే ముందుచూపుతో ప్రత్యేకంగా జీఓను తీసుకురావడమే కాక, అప్పటి వరకు ఉన్న జోనల్ చైర్మన్ల వ్యవస్థనే రద్దు చేయించిన గట్టి పట్టుదల కలిగిన నాయకుడు ఎమ్మెస్సార్.
Comments
Please login to add a commentAdd a comment