
హైదరాబాద్: రాష్ట్రంలో నానాటికి తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్యపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థి, నిరుద్యోగుల ధూంధాం జరిగింది.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాశ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ కాశీం, విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది నిరుద్యోగులు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ నిరుద్యోగుల కుటుంబాలు చితికిపోతుంటే చలించకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగుల కుటుంబాల్లో ఆత్మహత్యలతో విషాదఛాయలు అలుముకుంటే తన ఇంట్లో వారికి, తెలంగాణ వ్యతిరేకులకు పాలన పదవులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
2019లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే మొదటి సంతకం నిరుద్యోగుల నిర్మూలన, రైతులు, దళితుల అభ్యున్నతి ఫైళ్లపై సంతకం పెడుతామన్నారు. ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దె దించేలా ప్రచారం చేసి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
లోకల్ రిజర్వేషన్ల విషయంలో నిర్లక్ష్యం
జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ తనకి అవసరమున్న ఫైళ్లపై రాత్రికి రాత్రే సంతకం పెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ లోకల్ రిజర్వేషన్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలుండగా, ఇప్పటివరకు కేవలం 15 వేల ఉద్యోగాలనే భర్తీ చేశారని, అందులో పది వేల వరకు పోలీసు ఉద్యోగాలేనని తెలిపారు. ఈ నెల 31న జరిగే కొలువుల కొట్లాట సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు విద్యార్థి సంఘాల నాయకులు సంఘటితంగా పోరాడాలని కోదండరాం పిలుపునిచ్చారు.
మెగా నోటిఫికేషన్‌ను విడుదలజేయాలి
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ మాట్లాడుతూ టీఆర్‌టీలో 8 వేల పైగా ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేశారని, అందులో సగం జిల్లాల్లో ఉద్యోగాలే లేవన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శరణంగత్యామి చిత్రాన్ని ప్రదర్శించగా, కళాకారుడు ఏపూరి సోమయ్య ఆటపాటలతో ఆడిటోరియం దద్దరిల్లింది.
ప్రజాస్వామిక పోరాటాలపై ప్రభుత్వం ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామిక పోరాటాలు చేస్తున్న వారిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అందులో భాగంగానే మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శ్రీధర్ బాబుపై పెట్టిన కేసును ఎత్తివేయాలని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నైతికంగా ఉండే శ్రీధర్ బాబుపైన కేసు పెట్టడం అణచివేతకు నిదర్శనమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఆయన పోరాటాలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్ నాయకులకు కమీషన్లు రాకుండా పోతాయని భయం పట్టుకుందన్నారు. ప్రజాస్వామిక పోరాటాలు చేస్తున్న కోదండరాం, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులపై ఇలాంటి అణచివేత ధోరణులు కేసీఆర్ పాలనలో సహజంగా మారాయన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల అక్రమాలపై కేసులు పెట్టని పోలీసులు కాంగ్రెస్ నాయకులపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment