సాక్షి, హైదరాబాద్: దాదాపు 80 సీట్లతో ప్రజా కూటమి ఈ నెల 12న ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. గోల్కొండ హోటల్‌లో కూటమి నేతలతో కలిసి మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. రకరకాలుగా ఎగ్జిట్ పోల్స్‌పై ప్రచారం చేసుకుంటున్నారు.. విజయంపై మాకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో జరిగిన పొరపాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా క్షమాపణలు చెప్పారని అన్నారు.
ఓట్ల లెక్కింపులో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనేక మంది ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని, ఓటరు లిస్టులను సరి చేయకుండా ఎన్నికలు ఇంత త్వరగా నిర్వహించడాన్ని తప్పుపట్టారు. టీఆర్‌ఎస్ 35కు మించి రావని చెప్పారు. నాలుగున్నరేళ్లు ప్రజల్ని మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నారని వ్యాక్యానించారు. మా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ప్రజలకు దగ్గరగా ఉన్నాయని అన్నారు. కూటమి బాగా పనిచేసిందని కొనియాడారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిని గడ్డం ఎప్పుడు తీసున్నారని విలేకరులు ప్రశ్నించగా..తీసే సమయం వచ్చిందని చమత్కరించారు. జమిలి ఎన్నికలు అని చెప్పిన కేసీఆర్ ముందే ఎన్నికలకు పోవడానికి కారణమేంటో చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ప్రశ్నించారు. ప్రజల గొంతుకను కేసీఆర్ నొక్కే ప్రయత్నం చేశారని రమణ విమర్శించారు. కూటమితో ప్రజల గొంతుకను వినిపించామన్నారు.
వంశీచంద్ రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి
వంశీచంద్ రెడ్డికి పరామర్శ
అంతకు ముందు బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ కల్వకుర్తి అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తిలో మా అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ గూండాలు పాశవికంగా దాడి చేశారని చెప్పారు. వంశీ చంద్ గాయాల నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. ఏది ఏమైనా తమకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియాల సర్వే అంతా అబద్ధమని వ్యాఖ్యానించారు. తను కూడా వ్యక్తిగతంగా సర్వేలను నమ్మటం లేదని ఇండియాటుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తనతో చెప్పటమే కాదు, ట్వీట్ కూడా చేశారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment