‘కూత’కు మరో నాలుగు జట్లు
డజను జట్లతో అతిపెద్ద లీగ్‌గా ప్రొ కబడ్డీ
జూలైలో ఐదో సీజన్ షురూ
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో కొత్తగా మరో నాలుగు జట్లు కూత పెట్టేందుకు సిద్ధమయ్యాయి. దీంతో మొత్తం 12 జట్లతో భారత్‌లో అతి పెద్ద లీగ్‌గా ప్రొ కబడ్డీ ఆవిర్భవించనుంది. కొత్తగా తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హరి యాణా జట్లు పీకేఎల్‌లో భాగం కానున్నాయి. సీజన్ సీజన్‌కు పెరుగుతున్న ఆదరణను ఇతర రాష్ట్రాలకూ వ్యాపింపచేయాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కొత్తగా నాలుగు రాష్ట్ర జట్లకు అవకాశమివ్వాలని నిర్ణయించారు. గత నాలుగు సీజన్లలో ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లు అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెరిగిన జట్లతో పాటు మ్యాచ్‌లు కూడా పెరుగుతాయి.
మొత్తం 130కి పైగా మ్యాచ్‌లు, 13వారాలపాటు ప్రేక్షకుల్ని అలరించనున్నాయని పీకేఎల్ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో మొత్తం 11 రాష్ట్రాలు భాగమవుతున్నాయని అందులో పేర్కొన్నారు. ‘ఇప్పటికే స్టేక్ హోల్డర్లంతా లీగ్ విస్తరణకు ఆమోదం తెలిపారు. దీంతో మరింత ప్రాచుర్యంతో పాటు లీగ్ స్థాయి కూడా పెరుగుతుందని వారంతా భావిస్తున్నారు’ అని పీకేఎల్ బ్రాడ్‌కాస్ట్ భాగస్వామి ‘స్టార్ ఇండియా’ చైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ చెప్పారు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లాట్ మాట్లాడుతూ ‘కృషి ఉంటే ఓ సంప్రదాయ క్రీడను ఆధునిక క్రీడగా ఎలా మార్చవచ్చో, ఎంతగా ప్రాచుర్యంలోకి తీసుకురావొచ్చో అనేందుకు నిజమైన ఉదాహరణ ఈ ప్రొ కబడ్డీ లీగ్’ అని అన్నారు.