చివరి బంతికి రనౌట్.. మ్యాచ్ టై
కాఫ్స్ హార్బర్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే అభిమానులకు అసలైన క్రికెట్ మజా అందించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది.
243 పరుగుల లక్ష్యంతో దిగిన సౌతాఫ్రికా విజయానికి దాదాపుగా చేరువైంది. 49.5 ఓవర్లలో జట్టు స్కోరు 242/9. చేతిలో మరో వికెట్ ఉండగా, చివరి బంతికి మరో రన్ చేస్తే విజయం వరిస్తుంది. విలాని వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతిని ఆడిన క్లాస్ సింగిల్ తీసేందుకు వెళ్లింది. మూనీ.. క్లాస్‌ను రనౌట్ చేయడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కూడా 49.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా కావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఐదు వన్డేల సిరీస్‌ను ఆసీస్ ఇప్పటికే 3-0తో సొంతం చేసుకోగా, సౌతాఫ్రికా ఇంకా బోణీ కొట్టలేదు.
ఆస్ట్రేలియా జట్టులో బోల్టన్ (63), పెరీ (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లూస్ నాలుగు, వాన్ నీకెర్క్ మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో వాన్ నీకెర్క్ (81), కాప్ (66) అర్ధశతకాలు బాదారు. ఆస్ట్రేలియా బౌలర్ జొనాసెన్ మూడు వికెట్లు తీసింది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వాన్ నీకెర్క్ ఆల్ రౌండ్ షోతో రాణించినా ఫలితం లేకపోయింది.