T20I Tri-Series - India Women vs West Indies Women: సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్ మైదానంలో వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది.
ట్రై సిరీస్ మూడో మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్టును 56 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకుంది.
దంచికొట్టిన మంధాన
విండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా(18 పరుగులు) నిరాశపరిచినా.. మరో ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది.
51 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్మన్ డియోల్(12) విఫలం కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ అర్ద శతకం(35 బంతుల్లో 56 పరుగులు)తో మెరిసింది.
మంధాన మెరుపులకు తోడు హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
దెబ్బకొట్టిన దీప్తి శర్మ
టీమిండియా బౌలర్ దీప్తి శర్మ.. విండీస్ ఓపెనర్లు రషద విలియమ్స్(8), బ్రిట్నీ కూపర్(0)లను ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన షిమేనే కాంప్‌బెల్లె 47 పరుగులతో రాణించగా.. రాధా యాదవ్ ఆమెకు చెక్ పెట్టింది.
ఇతర బ్యాటర్లలో కెప్టెన్ హేలీ మాథ్యూస్(34- నాటౌట్) ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 111 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
ముందంజలో టీమిండియా
అంతకు ముందు.. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించిన భారత మహిళా జట్టు.. విండీస్‌ను సైతం ఓడించి సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఇక సౌతాఫ్రికా.. గత మ్యాచ్‌లో విండీస్‌పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. విండీస్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమే ఎదురైంది.
చదవండి: Ravindra Jadeja: జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా.. ఆసీస్‌తో మ్యాచ్ కోసం..
Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్?
Comments
Please login to add a commentAdd a comment