
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్‌లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్‌లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్‌కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు వివిధ టీ20 లీగ్‌ల్లో హర్మన్ చేసిన పరుగులు
డబ్ల్యూపీఎల్- 591 పరుగులు
మహిళల బిగ్‌బాష్ లీగ్- 1440 పరుగులు
హండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులు
అంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు
- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.
టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..
స్మృతి మంధన- 8349
హర్మన్‌ప్రీత్ కౌర్- 8005
జెమీమా రోడ్రిగెజ్- 5826
షఫాలీ వర్మ- 4542
మిథాలీ రాజ్- 4329
దీప్తి శర్మ- 3889
ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్‌కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్‌ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. మిడిలార్డర్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది.
Comments
Please login to add a commentAdd a comment