‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన; హర్మన్
హామిల్టన్: సరైన సమయంలో భారత స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ జూలు విదిల్చారు. రెండు సంచలన విజయాలతో జోరుమీదున్న వెస్టిండీస్‌ను నేలకు దించారు. ఫలితంగా మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో శనివారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
తొలుత స్మృతి మంధాన (119 బంతుల్లో 123; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీలతో అదరగొట్టగా... ఆ తర్వాత స్నేహ్ రాణా (3/22), మేఘన సింగ్ (2/27) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్‌ను దెబ్బ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు సాధించింది. అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 40.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ప్రపంచకప్ మ్యాచ్ ల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
అత్యుత్తమ భాగస్వామ్యం...
ఆరంభంలో యస్తిక భాటియా (21 బంతుల్లో 31; 6 ఫోర్లు), స్మృతి జోరు కనబరిచారు. షకీరా సెల్మన్ బౌలింగ్‌లో యస్తిక అవుటవ్వడంతో 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మిథాలీ రాజ్ (5; 1 ఫోర్), దీప్తి శర్మ (15; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. దాంతో భారత్ 78 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్మృతితో జత కలిసిన హర్మన్‌ప్రీత్ భారత ఇన్నింగ్స్ గతినే మార్చేశారు. ఈ ఇద్దరూ విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
ఇన్నింగ్స్ 40వ ఓవర్లో హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి స్మృతి తన వన్డే కెరీర్‌లో ఐదో సెంచరీ పూర్తి చేసుకుంది. హేలీ వేసిన 42వ ఓవర్లో స్మృతి వరుసగా మూడు ఫోర్లు కొట్టింది. ఆ తర్వాత షకీరా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి స్మృతి అవుటయ్యింది. దాంతో నాలుగో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. 47వ ఓవర్ తొలి బంతికి హర్మన్‌ప్రీత్ సింగిల్ తీసి తన వన్డే కెరీర్‌లో నాలుగో సెంచరీ నమోదు చేసుకుంది. 49వ ఓవర్లో హర్మన్ అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు 300 పరుగులు దాటింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శుభారంభం లభించినా...
319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఓపెనర్లు డియాండ్రా డాటిన్ (46 బంతుల్లో 62; 10 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (36 బంతుల్లో 43; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 12 ఓవర్లలో 100 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే 13వ ఓవర్లో డాటిన్‌ను అవుట్ చేసి స్నేహ్ రాణా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. డాటిన్ అవుటయ్యాక విండీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది.
24: ప్రపంచకప్ చరిత్రలో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌ల సంఖ్య. అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా బెలిండా క్లార్క్ (23; ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది.
40: విండీస్ బ్యాటర్ అనీసాను అవుట్ చేసిన క్రమంలో భారత పేసర్ జులన్ గోస్వామి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు (40) తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. 39 వికెట్లతో లినెట్టి (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జులన్ బద్దలు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment