
డివీలియర్స్ కొడుకా.. మజాకా!
బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. తనకు బాగా పెద్దదైపోయే టీషర్టు ధరించి తన సైజుకు సరిపోయే బుల్లి బ్యాటు పట్టుకుని బంతిని నెట్స్‌లోకి కొడుతూ ఏబీ డివీలియర్స్ కొడుకు అబ్రహం సందడి చేస్తున్నాడు. 'గో ఆర్సీబీ' అని వచ్చీరాని మాటలతో చెబుతూ తన తండ్రిని మురిపిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా ఏస్ క్రికెటర్ ఏబీ డివీలియర్స్ తన కొడుకు వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అచ్చం తనలాగే క్రికెట్ మీద ఇప్పటినుంచే మక్కువ చూపిస్తున్న కొడుకును చూసి ఏబీ మురిసిపోతున్నాడు.
బుల్లి ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని బంతిని కొడుతూ, ఏబీ బసచేసిన హోటల్లో మొత్తం అటూ ఇటూ పరుగులు పెడూత సందడి చేస్తున్న అబ్రహం వీడియో యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. ఇప్పటికే దానికి పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐపీఎల్ పదో సీజన్‌లో డివీలియర్స్ ఆర్‌సీబీ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడి 68.50 సగటుతో 137 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 141.23 ఉంది. గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గుజరాత్ జట్టుతో మ్యాచ్ జరగడానికి సరిగ్గా నాలుగు గంటల ముందు తాను ఆ మ్యాచ్‌లో ఆడుతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించి, తర్వాత మళ్లీ దాన్ని డిలీట్ చేసేశాడు. తర్వాత తాను ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో కేవలం 496 బంతుల్లోనే 89 పరుగులు చేసి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును దడదడలాడించాడు.