సాక్షి, హైదరాబాద్: స్కూల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎస్‌ఎఫ్‌ఎల్)లో ఓక్రిడ్జ్ (గచ్చిబౌలి), ఆగాఖాన్ అకాడమీ, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. రెండు నెలల పాటు జరిగిన ఈ టోర్నీలో ఆసాంతం రాణించిన ఈ జట్లు చాంపియన్‌లుగా నిలిచాయి. అండర్–13 కేటగిరీలో ఓక్రిడ్జ్, అండర్–15 విభాగంలో ఆగాఖాన్ అకాడమీ, అండర్–18 స్థాయిలో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు చాంపియన్‌కప్ ట్రోఫీలను కైవసం చేసుకున్నాయి. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగిన అండర్–13 బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ 2–1తో ఫ్యూచర్‌కిడ్స్‌పై గెలుపొందింది. అండర్–15 టైటిల్‌పోరులో ఆగాఖాన్ అకాడమీ 4–0తో ఫ్యూచర్‌కిడ్స్‌ను చిత్తుగా ఓడించింది. లీగ్ పద్ధతిలో జరిగిన అండర్–18 బాలుర పోటీల్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పోటీల్లో భాగంగా ఆగాఖాన్ అకాడమీ, ఓక్రిడ్జ్ గచ్చిబౌలి, గోల్కొండ స్కూల్‌లతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రీనిధి జట్టు గెలుపొందింది. ఈ కేటగిరీలో గోల్కొండ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది.
అండర్–18 స్థాయిలో సాహిల్ (ఆగాఖాన్) గోల్డ్ గ్లోవ్ అవార్డును అందుకోగా, కల్యాణ్ (శ్రీనిధి) గోల్డెన్ బూట్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ధ్రువ్ (శ్రీనిధి) ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. టోర్నీలో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా ఎస్‌ఎఫ్‌ఎల్ ఫార్మాట్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా లీగ్ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు చాంపియన్‌కప్ కోసం పోటీపడగా... మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రీమియర్ కప్ కోసం తలపడ్డాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు షీల్డ్ కప్ కోసం పోటీపడే విధంగా ఎస్‌ఎఫ్‌ఎల్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో అండర్–13 ప్రీమియర్ కప్ పోరులో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ 2–0తో ఆగాఖాన్‌పై, షీల్డ్ కప్ పోరులో డీఆర్‌ఎఫ్ కల్లమ్ అంజిరెడ్డి విద్యాలయ 2–1తో ఫ్యూచర్ కిడ్స్‌పై గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. అండర్–15 ప్రీమియర్ కప్ మ్యాచ్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2–1తో గోల్కొండ స్కూల్‌పై, షీల్డ్ కప్ మ్యాచ్‌లో కార్వాన్ ప్రభుత్వ పాఠశాల 3–1తో శ్రీనిధి ప్రభుత్వ స్కూల్‌పై గెలుపొంది ట్రోఫీలను గెలుచుకున్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ఫు ట్‌బాల్ సంఘం చైర్మన్ కేటీ మహి ముఖ్య అతిథి గా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment