సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ ప్రీమియర్ కప్ టోర్నమెంట్‌లో గోల్కొండ ప్రభుత్వ హైస్కూల్, అబ్బాస్ యూనియన్, శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ జట్లు సత్తా చాటాయి. బుధవారం జరిగిన ఫైనల్లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఏకపక్షంగా సాగిన అండర్–18 కేటగిరీ టైటిల్ పోరులో అబ్బాస్ యూనియన్ ఎఫ్‌సీ 4–0తో అథ్లెటికో హైదరాబాద్ జేఎఫ్‌ఏ జట్టుపై ఘనవిజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో చాంపియన్ ఫుట్‌బాల్ అకాడమీ వాకోవర్ ఇవ్వడంతో స్కైకింగ్స్ ఎఫ్‌సీ జట్టు ఆ స్థానాన్ని దక్కించుకుంది.
మరోవైపు అండర్–15 బాలుర ఫైనల్లో గోల్కొండ ప్రభుత్వ స్కూల్ 1–0తో డెక్కన్ బ్లాస్టర్స్ జట్టును ఓడించింది. విజేత జట్టులో ఇబ్రహీం ఖాన్ ఒక గోల్ చేసి జట్టును గెలిపించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ 5–4తో ఫరీద్ ఫుట్‌బాల్ అకాడమీపై గెలుపొంది మూడోస్థానంలో నిలిచింది. అండర్–13 బాలుర ఫైనల్లో శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ 2–1తో యునైటెడ్ స్టడ్స్ ఎఫ్‌సీని ఓడించి విజేతగా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ మొహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ అలీ రఫత్, కార్యదర్శి జీపీ ఫల్గుణ, శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ కేటీ మహీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment