
‘అర్జున’కు కొలమానం ఏమిటి?
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... ప్రతిపాదిత ‘అర్జున పురస్కారాల’ క్రీడాకారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు జాతీయ క్రీడా పురస్కారాల ఎంపికకు కొలమానం ఏమిటో అర్థం కావడంలేదని ఈ ‘లండన్ ఒలింపియన్’ బాధపడుతున్నాడు. కెరీర్‌లో అద్భుత విజయాలు సాధించినా కేంద్ర ప్రభుత్వ అవార్డుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మనోజ్ అన్నాడు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించేందుకు కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్‌ను కలుసుకోవాలని భావిస్తున్నాడు.
‘మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. నా బాధ ఆయనతో చెప్పుకోవాల్సి ఉంది. అసలు అవార్డు కోసం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది అర్థం కావడం లేదు’ అని మనోజ్ అన్నాడు. మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన కవితా చహల్‌కు మాత్రమే ఈ సారి అర్జున అవార్డు దక్కే బాక్సింగ్ జాబితాలో ఉంది. మనోజ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌దాకా వెళ్లగా రెండుసార్లు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించాడు. ఇటీవల సైప్రస్‌లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ కప్‌లో రజతం నెగ్గాడు.