భారత మహిళల ‘హ్యాట్రిక్'
ఇస్లామాబాద్: పాత ప్రత్యర్థి. కొత్త వేదిక. అయినా అదే ఫలితం. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత జట్టు మరోసారి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టీమిండియా 6-0 గోల్స్ తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి ఈ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకొని ‘హ్యాట్రిక్’ సాధించింది. 2010 (బంగ్లాదేశ్‌లో), 2012 (శ్రీలంకలో) ఫైనల్స్‌లోనూ నేపాల్‌నే ఓడించిన భారత్‌కు ఈసారీ పోటీ ఎదురవలేదు.
ఈ టోర్నీలో ఆద్యంతం దూకుడుగా ఆడిన భారత్ మొత్తం 36 గోల్స్ చేసి, కేవలం ఒక గోల్ మాత్రమే ప్రత్యర్థికి సమర్పించుకుంది. టైటిల్ పోరులో ఫేవరెట్‌గా దిగిన టీమిండియాకు 26వ నిమిషంలో కమలా దేవి తొలి గోల్‌ను అందించింది. ఆ తర్వాత బాలా దేవి నాలుగు గోల్స్ (31వ, 34వ, 51వ, 90+2వ నిమిషాల్లో) చేయగా, రోమీ దేవి (46వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. ఈ టోర్నీలో బాలా దేవి మొత్తం 16 గోల్స్ చేసి ‘టాప్ స్కోరర్’గా నిలిచింది.