టీమిండియా నయా చరిత్ర | India Clinch 1st Ever series Whitewash Of South Africa | Sakshi
Sakshi News home page

టీమిండియా నయా చరిత్ర

Published Tue, Oct 22 2019 10:07 AM | Last Updated on Tue, Oct 22 2019 2:04 PM

India Clinch 1st Ever series Whitewash Of South Africa - Sakshi

రాంచీ:  దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చివరిదైన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలి రెండు టెస్టులను సునాయాసంగా గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో సైతం అదే జోష్‌ కనబరిచి సిరీస్‌ను 3-0తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా నయా రికార్డును సాధించింది.  టెస్టు ఫార్మాట్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోరులో  దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో టీమిండియాదే పైచేయిగా ఉంది. కేవలం భారత్‌లో సఫారీలతో ఒక్క సిరీస్‌ను మాత్రమే టీమిండియా కోల్పోయింది. కాకపోతే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఇంకా టెస్టు సిరీస్‌ను గెలవలేదు.  ఈ సిరీస్‌ ముందు వరకూ దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయలేదు. దాన్ని ఇప్పుడు విరాట్‌ గ్యాంగ్‌ సాధించింది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం.

మంగళవారం నాల్గో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలౌటైంది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లను టీమిండియా పడగొట్టి సిరీస్‌లో తమకు ఎదురులేదని నిరూపించింది. బ్రుయిన్‌(30) తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,. లుంగీ ఎన్‌గిడీ డకౌట్‌ అయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా కథ ముగిసింది. చివరి రెండు వికెట్లను నదీమ్‌ సాధించాడు.  భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌, నదీమ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. జడేజా, అశ్విన్‌లకు చెరో వికెట్‌ లభించింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలోఆన్‌ తప్పలేదు. అయితే వారి రెండో ఇన్నింగ్స్‌ కూడా కష్టాలతోనే మొదలైంది. రిటైర్డ్‌హర్ట్‌ ఎల్గర్‌ (16) మినహా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అంతా 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు. డికాక్‌ (5)ను ఉమేశ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్న హమ్జా (0)కు షమీ ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదే ఊపులో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (4)ను షమీ ఎల్బీ చేశాడు.



మొత్తానికి మూడో సెషన్‌కు ముందే సఫారీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. టీ బ్రేక్‌ తర్వాత కూడా పర్యాటక జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లిండే (27), పీట్‌ (23) నిలబడటంతో జట్టుస్కోరు వందకు చేరింది. ఎల్గర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రుయిన్‌ కాస్త ప్రతిఘటించాడు. కాగా, ఈ రోజు తన వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోరు వద్దే బ్రుయిన్‌  ఔట్‌ కావడం, ఆపై ఎన్‌గిడీ ఆడిన తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరడంతో టీమిండియా భారీ విజయం సాధించడంతో పాటు దక్షిణాఫ్రికాను తొలిసారి వైట్‌వాష్‌ చేసింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 497/9 డిక్లేర్డ్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 162 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 133 ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement