
ఆసియా జూనియర్ స్క్వాష్ చాంప్ భారత్
హాంకాంగ్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత యువ స్క్వాష్ జట్టు ఆరేళ్ల తర్వాత ఆసియా జూనియర్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం ముగిసిన ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాపై భారత్ 2–0తో విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ వెలవన్ సెంథిల్ కుమార్ 12–10, 11–0, 11–2తో ఓంగ్ సాయ్ హుంగ్‌పై... రెండో సింగిల్స్‌లో అభయ్ సింగ్ 10–12, 7–11, 11–5, 14–12, 11–6తో డారెన్ రాహుల్ ప్రగాసంపై గెలిచి భారత్‌కు టైటిల్‌ను అందించారు. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు.
ఈ టోర్నీలో భారత్ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత సెమీస్‌లో హాంకాంగ్‌పై నెగ్గి ఫైనల్‌కు చేరింది. తుది పోరులోనూ నెగ్గి ఈ టోర్నీని అజేయంగా ముగించింది. భారత్ చివరిసారి 2011లో ఆసియా జూనియర్ విజేతగా నిలిచింది.