కథ క్వార్టర్స్‌లోనే...
మలేసియా చేతిలో భారత్‌కు పరాభవం
లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం మలేసియాతో జరిగిన కీలక క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడింది. రెండో క్వార్టర్‌లో మలేసియా తరఫున రహీమ్ రజి (19వ నిమిషం) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు 1–0తో ఆధిక్యాన్నిచ్చాడు. తర్వాత నిమిషంలో తాజుద్దీన్ (20వ ని.) కూడా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు.
భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (24వ ని., 26వ ని.) రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేశాడు. ఈ నాలుగు గోల్స్ రెండో క్వార్టర్‌లోనే నమోదయ్యాయి. మూడో క్వార్టర్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయారు. అయితే చివరి క్వార్టర్ మొదలైన మూడు నిమిషాలకే రహీమ్ రజీ (48వ ని.) రెండో గోల్ చేసి మలేసియాకు విజయాన్ని ఖాయం చేశాడు. ఆట చివరి నిమిషంలో రమణ్‌దీప్ గోల్ కోసం చేసిన ప్రయత్నం తృటిలో తప్పింది. దీంతో భారత్ ఓటమిపాలైంది. వర్గీకరణ మ్యాచ్‌లో రేపు (శనివారం) భారత్, పాకిస్తాన్‌తో తలపడనుంది.