నైట్‌రైడర్స్ రైట్ రైట్...
► ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా
► చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై విజయం
► 22 పరుగులతో ఓడిన సన్‌రైజర్స్
యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే మెరుపు బ్యాటింగ్... నరైన్ బౌలింగ్ మాజీ చాంపియన్ కోల్‌కతాను ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు చేర్చాయి. మ్యాచ్ గెలిస్తే రన్‌రేట్‌లతో సంబంధం లేకుండా నేరుగా ముందంజ వేసే అవకాశం ఉన్న స్థితిలో సొంతగడ్డపై చెలరేగిన నైట్‌రైడర్స్, హైదరాబాద్‌ను మట్టికరిపించి ముందంజ వేసింది. భారీ లక్ష్య ఛేదనలో ధావన్ చెలరేగినా... ఇన్నింగ్స్‌లో మొత్తం 50 డాట్ బాల్స్ ఆడిన సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.
కోల్‌కతా: గౌతం గంభీర్ సారథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మరో సారి ప్లే ఆఫ్‌లోకి అడుగు పెట్టింది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 22 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యూసుఫ్ పఠాన్ (34 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (30 బంతుల్లో 48; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 49 బంతుల్లోనే 87 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. సునీల్ నరైన్ (3/26) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.
కీలక భాగస్వామ్యం: భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి రాబిన్ ఉతప్ప (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) కోల్‌కతాకు శుభారంభం అందించాడు. అయితే బరీందర్ అతని దూకుడుకు బ్రేక్ వేయగా, ఆ తర్వాత హుడా తన వరుస ఓవర్లలో మున్రో (10), గంభీర్ (16)లను అవుట్ చేశాడు. ఈ దశలో పాండే, పఠాన్ భారీ షాట్లతో దూకుడును ప్రదర్శించారు. కరణ్ వేసిన రెండు వరుస ఓవర్లలో వీరిద్దరు కలిసి 33 పరుగులు రాబట్టారు. 16వ ఓవర్లో విలియమ్సన్ చక్కటి క్యాచ్‌తో పాండే వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదించింది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ధావన్ మినహా: ఈ సీజన్ ఆసాంతం సాధారణ స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ధావన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్ ఉన్నంత సేపు సన్ ఆశలు నిలిచాయి. అయితే అతను అవుటయ్యాక సన్ ఓటమి ఖాయమైంది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) విలియమ్సన్ (బి) బరీందర్ 25; గంభీర్ (సి) హెన్రిక్స్ (బి) హుడా 16; మున్రో (సి) ఓజా (బి) హుడా 10; పాండే (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 48; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 52; హోల్డర్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 3; షకీబ్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 7; సూర్యకుమార్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1-33; 2-48; 3-57; 4-144; 5-153; 6-164.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-31-2; బరీందర్ 4-0-31-1; విలియమ్సన్ 1-0-7-0; హుడా 2-0-16-2; కరణ్ శర్మ 3-0-39-0; హెన్రిక్స్ 2-0-14-0; ముస్తఫిజుర్ 4-0-32-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (సి) మున్రో (బి) కుల్దీప్ 51; వార్నర్ (బి) నరైన్ 18; ఓజా (సి) ఉతప్ప (బి) నరైన్ 15; యువరాజ్ (సి) (సబ్) సతీశ్ (బి) షకీబ్ 19; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 7; హుడా (రనౌట్) 2; హెన్రిక్స్ (బి) నరైన్ 11; కరణ్ శర్మ (నాటౌట్) 8; భువనేశ్వర్ (సి) (సబ్) సతీశ్ (బి) రాజ్‌పుత్ 5; బరీందర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1-28; 2-86; 3-92; 4-110; 5-115; 6-117; 7-136; 8-144.; బౌలింగ్: యూసుఫ్ పఠాన్ 1-0-4-0; రాజ్‌పుత్ 3-0-21-1; షకీబ్ 4-0-34-1; నరైన్ 4-0-26-3; హోల్డర్ 3-0-21-0; మున్రో 1-0-8-0; కుల్దీప్ 4-0-28-2.