
ఆర్‌సీఏలోకి మళ్లీ లలిత్ మోడి!
జైపూర్: వివాదాస్పద ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. మళ్లీ రాజస్తాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు అతనిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అమిన్ పఠాన్ బుధవారం అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంపై జస్టిస్ జ్ఞాన్ సుధ మిశ్రా.. ఆర్‌సీఏ అధికారులతో కలిసి చర్చించారు. ‘క్రికెట్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15 జిల్లా సంఘాలు, ముగ్గురు ఆఫీస్ బేరర్లు మోడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక నిబంధనల ప్రకారం తీర్మానంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి నిబంధనల ప్రకారం ఎన్నికైన మోడి తిరిగి బాధ్యతలు స్వీకరించొచ్చు. ఈ సమావేశానికి అన్ని సంఘాలు, బేరర్లు హాజరయ్యారు. పఠాన్ దరఖాస్తును వెనక్కి తీసుకోవడానికి అందరూ మద్దతిచ్చారు’ అని మిశ్రా పేర్కొన్నారు. గతంలో ఆర్‌సీఏను తమ ఆధీనంలో తీసుకోవాలని పఠాన్ వర్గం... తీర్మానం సందర్భంగా మోడి గ్రూప్‌పై రాళ్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ 2/3 మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు.