‘లైట్' గా ఓ కాంస్యం!
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో ఐదో రోజు బుధవారం భారత్‌కు పెద్దగా కలిసి రాలేదు. కేవలం ఒకే ఒక కాంస్య పతకంతో భారత్ సరి పెట్టుకుంది. పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ సింగిల్ స్కల్ విభాగంలో దుశ్యంత్ చౌహాన్ కంచు మోత మోగించాడు. అతను 7 నిమిషాల 26.57 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ రేస్‌లో ఎక్కువ సేపు ఆధిక్యంలో కొనసాగినా...చివర్లో ప్రతికూల వాతావరణం కారణంగా వెనుకబడిన దుశ్యంత్ కాంస్యంతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
కలిసి రాని పవనం...
లైట్ వెయిట్ సింగిల్ స్కల్‌లో మొత్తం పూర్తి చేయాల్సిన రేస్ 2000 మీటర్లు కాగా... దుశ్యంత్ తొలి 500 మీటర్ల తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 1800 మీటర్లు పూర్తయ్యే వరకు దానిని నిలబెట్టుకున్న అతను పట్టు తప్పాడు. వేగంగా వీచిన గాలులతో పాటు కొద్దిపాటి వర్షం కారణంగా అతను నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా లోక్ క్వాన్ హై (హాంకాంగ్- 7 ని. 25.04 సె.) దూసుకుపోయి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా చౌహాన్ కోలుకోలేకపోవడంతో మరో రోయర్ లీ హక్‌బెమ్ (దక్షిణ కొరియా- 7 ని. 25.95 సె.) రెండో స్థానంలో నిలిచాడు. ఫలితంగా భారత్‌కు కాంస్యం మాత్రమే లభించింది.
‘స్వర్ణం సాధించాల్సింది’
ఆర్మీలో పని చేస్తున్న దుశ్యంత్ స్వస్థలం హర్యానా. రూర్కీలోని బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో అతను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రేస్‌లో దురదృష్టం తనను వెంటాడిందని, కచ్చితంగా స్వర్ణం సాధించాల్సిందని దుశ్యంత్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ స్థాయిలో అతనికి ఇదే తొలి ఈవెంట్ కావడం విశేషం. ‘రేస్ సమయంలో స్వర్ణంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాను. అయితే ఇతరులతో పోలిస్తే గాలి నా లేన్‌పైనే ఎక్కువ ప్రభావం చూపించింది. ఏదేమైనా ఆసియాడ్‌లో కాంస్యం పట్ల కూడా సంతృప్తిగా ఉన్నాను’ అని చౌహాన్ చెప్పాడు.
లైట్ వెయిట్ సింగిల్ స్కల్ అంటే..
రోయింగ్ క్రీడలో ఉండే వేర్వేరు విభాగాల్లో లైట్ వెయిట్ కేటగిరీ కూడా ఒకటి. ఎక్కువగా భారీకాయులు ఉండే రోయింగ్‌లో రోయర్ల బరువుకు పరిమితి విధిస్తూ ఈ కేటగిరీని నిర్వహిస్తున్నారు. కేవలం నైపుణ్యమే తప్ప శారీరక సామర్థ్యం గెలుపోటములపై ప్రభావం చూపించకూడదని దీనిని ప్రవేశపెట్టారు. సింగిల్ స్కల్ ఈవెంట్‌లో ఒకే రోయర్ బోటును నడిపిస్తూ పోటీ పడాల్సి ఉంటుంది. లైట్ వెయిట్ సింగిల్ స్కల్ కేటగిరీలో పోటీ పడే పురుషులు 72.5 కేజీలు, మహిళలు 59 కేజీల శారీరక బరువును మించి ఉండరాదు. అన్నింటికి మించి ‘సాధారణంగా జన్యుపరంగా, వాతావరణపరంగా ఎక్కువ శారీరక దారుఢ్యం ఉండే దేశాలతో పోలిస్తే తక్కువ దారుఢ్యం కలిగిన దేశాలను కూడా రోయింగ్‌లో ప్రోత్సహించడం’ ఈ ఈవెంట్ ప్రధాన ఉద్దేశం. 1996 ఒలింపిక్స్‌లో మొదటి సారి దీనిని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2002లో... బాక్సింగ్, రెజ్లింగ్‌లాంటి క్రీడలు, వెయిట్‌లిఫ్టింగ్‌లలో తప్ప ఇతర క్రీడల్లో బరువును బట్టి ఈవెంట్లు ఉండరాదని ఐఓసీ ప్రోగ్రామ్ కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.