
ప్రశాంత కర్మాకర్
న్యూఢిల్లీ: ప్రశాంత కర్మాకర్...పారా స్విమ్మింగ్‌లో అద్భుతాలు చేసిన భారత ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏకంగా వరుసగా 16 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా రికార్డు సృష్టించడంతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో కూడా కాంస్యం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో జట్టుకు కోచ్ కూడా. అలాంటి వ్యక్తి తప్పుడు పనికి పాల్పడ్డాడు. ప్రొఫెషనల్ విలువలు మరచి సహచర మహిళా స్విమ్మర్లు పూల్‌లో ఉండగా వీడియోలు షూట్ చేశాడు. తన సన్నిహితుడితో కూడా మరికొన్ని తీయించాడు. గతేడాది జరిగిన ఈ అనూహ్య ఘటనపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఇప్పుడు స్పందించింది. మహిళా స్విమ్మర్ల తల్లిదండ్రుల ఫిర్యాదుపై విచారణ జరిపి కర్మాకర్‌పై చర్య తీసుకుంది. అతనిపై మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జైపూర్‌లో జాతీయ చాంపియన్‌షిప్ సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. వీడియో షూట్ చేయడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన తర్వాత కూడా ప్రశాంత నిస్సిగ్గుగా షూట్ చేయడంలో తప్పేమీ లేదంటూ పీసీఐ అధికారులతో వాదనకు దిగాడు. తాను అర్జున అవార్డీనంటూ, తనను ఎలా ఆపుతారంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మహిళా స్విమ్మర్ల తల్లిదండ్రులు రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. దాంతో 37 ఏళ్ల ప్రశాంతను అదుపులోకి తీసుకున్న పోలీసులు... చివరకు కెమెరాలనుంచి అన్ని వీడియోలను తొలగిస్తానని చెప్పడంతో అతడిని వదిలేశారు. ఈ ఘటనతో కర్మాకర్ ఇన్నేళ్ల పేరు, ప్రతిష్టలతో పాటు పరువును కూడా పోగొట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment