ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌లో రాహుల్‌కు స్వర్ణం
దోహా (ఖతార్): ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణంతోపాటు మూడు కాంస్య పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ ఓవరాల్‌గా 324 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి అయిన రాహుల్ స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు బరువెత్తాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ గతేడాది యూత్ ఒలింపిక్స్‌లో రజతం, ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. జూనియర్ మహిళల విభాగంలో థసానా చాను (58 కేజీలు) మొత్తం 179 కేజీలు; పూనమ్ యాదవ్ (63 కేజీలు) మొత్తం 192 కేజీలు ఎత్తి కాంస్య పతకాలు నెగ్గారు.
యూత్ మహిళల విభాగంలో కేఎస్ నుంగ్‌షిటాన్ (58 కేజీలు) మొత్తం 166 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 23 దేశాలు పోటీపడు తున్న ఈ పోటీల్లో ఇప్పటిదాకా భారత వెయిట్‌లిఫ్టర్లు ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు గెల్చుకున్నారు.