Indian lifter
-
మీరాబాయి ప్రపంచ రికార్డు
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది. శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మీరాబాయి క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో స్వర్ణం... ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది. స్నాచ్‌లో మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 213 కేజీలతో (స్నాచ్‌లో 96+క్లీన్ అండ్ జెర్క్‌లో 117) జిహుయ్ హౌ (చైనా) స్వర్ణం... 207 కేజీలతో (స్నాచ్‌లో 89+క్లీన్ అండ్ జెర్క్‌లో 118) హుయ్‌హువా జియాంగ్ రజతం సాధించారు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఒక పతకం ఇవ్వకుండా... స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, టోటల్ విభాగాలకు వేర్వేరు పతకాలు అందజేస్తున్నారు. -
రాహుల్‌కు స్వర్ణ, రజతాలు
పుణే: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీల మూడో రోజు భారత్‌కు ఏడు పతకాలు లభించగా... అందులో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట్ రాహుల్ జూనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో మొత్తం 327 కేజీల బరువెత్తి స్వర్ణం నెగ్గగా... అంతే మొత్తానికి సీనియర్ పురుషుల విభాగంలో రజతం సాధిం చాడు. స్నాచ్‌లో రాహుల్ 181 కేజీలు ఎత్తి జూనియర్ కామన్వెల్త్ పోటీల్లో మీట్ రికార్డు నెలకొల్పాడు. యూత్ మహిళల 63 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి. లలిత (164 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది. సీనియర్, జూనియర్ మహిళల 63 కేజీల విభాగాల్లో పూనమ్ యాదవ్ (200 కేజీలు) రెండు స్వర్ణాలు సాధించింది. సీనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (335 కేజీలు) పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. జూనియర్ మహిళల 69 కేజీల విభాగంలో స్వప్నప్రియ బారువా (170 కేజీలు) స్వర్ణం సాధించింది. -
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌లో రాహుల్‌కు స్వర్ణం
దోహా (ఖతార్): ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. పోటీల నాలుగో రోజు భారత్‌కు స్వర్ణంతోపాటు మూడు కాంస్య పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ ఓవరాల్‌గా 324 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి అయిన రాహుల్ స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు బరువెత్తాడు. గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ గతేడాది యూత్ ఒలింపిక్స్‌లో రజతం, ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. జూనియర్ మహిళల విభాగంలో థసానా చాను (58 కేజీలు) మొత్తం 179 కేజీలు; పూనమ్ యాదవ్ (63 కేజీలు) మొత్తం 192 కేజీలు ఎత్తి కాంస్య పతకాలు నెగ్గారు. యూత్ మహిళల విభాగంలో కేఎస్ నుంగ్షిటాన్ (58 కేజీలు) మొత్తం 166 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 23 దేశాలు పోటీపడు తున్న ఈ పోటీల్లో ఇప్పటిదాకా భారత వెయిట్‌లిఫ్టర్లు ఐదు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు గెల్చుకున్నారు.