'రెండు లైన్ల రెజ్యూమ్'పై సెహ్వాగ్ ఇలా..
న్యూఢిల్లీ: తాను భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన క్రమంలో ముందుగా రెండు లైన్ల రెజ్యూమ్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు పంపానంటూ మీడియాలో వెలుగుచూసిన వార్తలపై వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు స్పందించాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అదంతా మీడియా సృష్టేనని తాజాగా వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. అసలు రెండు లైన్ల రెజ్యూమ్ అనేదిపేరుకే సరిపోతుందని, అటువంటప్పుడు ఆ తరహా రెజ్యూమ్ ను ఎందుకు పంపుతానంటూ ఎదురుప్రశ్నించాడు. తాను పంపిన రెజ్యూమ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనలకే లోబడే ఉందంటూ స్పష్టం చేశాడు.
'మీడియా చెప్పినట్లు రెండు లైన్ల రెజ్యూమ్ పంపి ఉంటి నిజంగా చాలా సంతోషించేవాణ్ని. ఒకవేళ కోచ్ పదవికి రెండు లైన్లలో రెజ్యూమ్ పంపి ఉంటి అది కేవలం నా పేరుకే సరిపోతుంది. అటువంటప్పుడు నా వివరాలు ఎలా పంపగలను'అని సెహ్వాగ్ ప్రశ్నించాడు.ఇదిలా ఉంచితే, తన క్రికెట్ కెరీర్ నిలకడగా సాగడానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనే కారణమని సెహ్వాగ్ తెలిపాడు. మైదానంలో ఓపికగా ఎలా ఆడాలో నేర్చుకున్నది గంగూలీ నుంచి అంటూ కితాబిచ్చాడు. తనకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ కెప్టెన్ గంగూలీనే అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనలో నమ్మకాన్ని పెంచిన ఆటగాడన్నాడు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫోర్లు కొట్టడం సచిన్ నుంచి అలవర్చుకున్నదేనని సెహ్వాగ్ తెలిపాడు.