క్రీడా మంత్రి హడావిడి సమీక్ష | Sports minister rushed review | Sakshi
Sakshi News home page

క్రీడా మంత్రి హడావిడి సమీక్ష

Published Thu, Aug 22 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Sports minister rushed review

సాక్షి, హైదరాబాద్: ఒక వైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం... మరో వైపు తెలంగాణాలో శాంతి ర్యాలీలు వగైరా సాగుతూనే ఉన్నాయి. కీలక ప్రభుత్వ శాఖలు దాదాపుగా స్థంభించిపోయా యి. ఇలాంటి స్థితిలో క్రీడా శాఖ మంత్రి వట్టి వసంత కుమార్‌కు ఒక్కసారిగా రాష్ట్రంలో క్రీడలపై ప్రేమ కలిగింది. దాంతో ఈ శాఖ సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. అదేదో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి గురించో, మినీ స్టేడియాల నిర్మాణం గురించో, లేదంటే పేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించడం గురించో అయితే ఫర్వాలేదు. అయితే కేవలం కొంత మందికి వ్యక్తిగత ప్రయోజనం కలిగించేందుకే ఈ హడావిడి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
 
  క్రీడా శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్  మరో మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు. పైగా సాధారణంగా మంత్రులు సమీక్షలు జరిపే సచివాలయంలో కాకుండా దీనిని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఇదేమీ అంత అత్యవసర సమావేశం కాదు. ఇందులో వాస్తవానికి సమీక్షకంటే... నిబంధనలకు విరుద్ధంగా తనకు కావాల్సిన ఫైళ్లు సిద్ధం చేయమంటూ ‘శాప్’ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు రూ. 50 లక్షలు ఇచ్చే విధంగా ఫైలు సిద్ధం చేయాలంటూ ‘శాప్’ అధికారులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం.
 
 నిబంధనల ప్రకారం సింధు రూ.5 లక్షలకే అర్హురాలు. థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్, మాల్దీవ్స్ చాలెంజ్ టోర్నీలో విజేతలుగా నిలిచిన శ్రీకాంత్, నందగోపాల్‌లకు కూడా ఇదే తరహాలో నగదు పురస్కారం ఇప్పించాలని మంత్రి భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక చెస్ క్రీడాకారిణికి, గుంటూరులో హాకీ టోర్నీ నిర్వహణకు హాకీ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 25 లక్షలు ఇచ్చేందుకు... ఇలా మంత్రిగారి సమీక్ష మొత్తం వీటిపైనే సాగింది. హాకీ సమాఖ్యలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో డబ్బులు ఇవ్వడం వీలు కాదంటూ రెండు వారాల క్రితమే హాకీ సంఘం అభ్యర్థనను ‘శాప్’ తిప్పి పంపింది. ఇప్పుడు అదే ఫైలును మంత్రి ముందుకు నెడుతున్నట్టు సమాచారం.
 
 రాష్ట్ర మంత్రిని ఆటతో సంబంధం లేని కొంత మంది వ్యక్తులు బాగా తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే క్రీడ అన్నట్లుగా వారు మంత్రికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు. తగిన నిధులు లేక రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ఆగిపోయింది. మూడేళ్లుగా టోర్నీల కోసం ఖర్చు పెట్టిన రూ. 80 లక్షలు ఇవ్వాలంటూ స్వయంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంకా పైసా రాలేదు. ఇప్పుడు ఒక్కో ఆటగాడికి లక్షలు కుమ్మరించాలని ప్రయత్నించడం నిజంగా అన్యాయం.
 - ఏపీ ఒలింపిక్ సంఘం ప్రతినిధి ఆవేదన
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement