
లండన్ : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆటకు తాను మంత్ర ముగ్దుడిని అయ్యానని కొనియాడాడు. అంతేకాకుండా ఏకంగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ లాన్స్ క్లుసెనర్‌తో హార్దిక్‌ను పోల్చాడు. బలమైన ఆసీస్ బౌలింగ్‌లో కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు రాబట్టి టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి ఈ ఆల్‌రౌండర్ సహకరించాడని పేర్కొన్నాడు.
‘ఈ టోర్నీలో హార్దిక్ ఆటను చూస్తుంటే 1999 ప్రపంచకప్‌లో సఫారీ ఆల్‌రౌండర్ క్లుసెనర్ గుర్తుకొస్తున్నాడు. టీ20లు లేనిసమయంలోనే ధాటిగా ఆడేవాడు. ఎదుర్కొనే తొలి బంతి నుంచి చివరి బంతి వరకు హిట్టింగ్ చేయాలనే ఆడతారు ఇద్దరూ. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి జట్టు సారథి ఆత్మరక్షణలో పడతాడు. ప్రస్తుతం హార్దిక్ టైం నడుస్తోంది. ఇక టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఆటగాళ్లు రాణించారు. అది టీమిండియాకు శుభపరిణామం. కోహ్లి, ధోనిల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆసీస్ నిరుత్సాహపరిచింది..
టీమిండియాపై ఆసీస్ ఆటగాళ్లు ఆడిన తీరు నిరుత్సాహపరిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చాలా పొరపాట్లు చేశారు. వార్నర్, స్మిత్‌లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు, బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేస్తే బెటర్’అంటూ స్టీవ్ వా పేర్కొన్నాడు. ఇక 1999 ప్రపంచకప్‌లో క్లుసెనర్ 122.17 స్ట్రైక్‌రేట్‌తో 281 పరుగులు చేసి సఫారీ విజయాలలో కీలకపాత్ర పోషించాడని, టీ20లు లేని కాలంలోనే అంత స్ట్రైక్ రేట్ మెయింటేన్ చేయడం మామూలు విషయం కాదని స్టీవ్‌వా చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment