Lance Klusener
-
ఐపీఎల్-2024కు ముందు లక్నో కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అస్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నియమించింది. హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి క్లూసెనర్ పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లక్నో ఫ్రాంచైజీ వెల్లడించింది. కాగా లాన్స్ క్లూసెనర్ ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సహాయక కోచ్‌గా పనిచేశాడు. అధేవిధంగా సౌతాఫ్రికా టీ20లీగ్‌లో లక్నో ఫ్రాంచైజీ డర్భన్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా క్లూసెనర్ ప్రస్తుతం పనిచేస్తున్నాడు. అంతేకాకుండా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా గయానా నిలవడంలో అమెజాన్ వారియర్స్‌ది కీలక పాత్ర. ఇక ఈ ఏడాది సీజన్‌కు ముందు లక్నో తమ వైస్ కెప్టెన్‌ను కూడా మార్చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్ధానంలో విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను తమ వైస్ కెప్టెన్‌గా లక్నో నియమించింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs ENG: ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. కానీ 'నో' చెప్పేశాడుగా!? -
త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ త్రిపుర క్రికెట్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ శనివారం(జూన్ 3న) త్రిపుర క్రికెట్ కన్సల్టెంట్ పదవిని స్వీకరించనున్నాడు. ఇప్పటికే అగర్తల చేరుకున్న క్లూసెనర్ రానున్న దేశవాలీ క్రికెట్ సీజన్లో భాగంగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండనున్నాడు. త్రిపుర జట్టు కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ తొలుత 100 రోజుల సీజన్‌కు అందుబాటులో ఉంటాడని.. 20 రోజులు అగర్తల క్యాంప్‌లో ఉండి జట్టును పర్యవేక్షిస్తాడని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తిమిర్ చందా పేర్కొన్నాడు. కాగా కన్సల్టెంట్ పోస్టుకు మా వెబ్సైట్లో ఒక ప్రకటన చేశాం. ఈ పదవి చేపట్టేందుకు డేవ్ వాట్మోర్ సహా లాన్స్ క్లూసెనర్లు ఆసక్తి చూపించారు. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా డేవ్ వాట్మోర్ రేసు నుంచి తప్పుకోవడంతో లాన్స్ క్లూసెనర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అంటూ చెప్పకొచ్చాడు. కాగా కొన్నేళ్ల క్రితం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఒక ఫ్రాంచైజీకి క్లూసెనర్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇక అంతర్జాతీయంగా 1996 నుంచి 2004 వరకు దక్షిణాఫ్రికా తరపున ఆడిన క్లూసెనర్ 49 టెస్టుల్లో 1906 పరుగులతో పాటు 80 వికెట్లు, 171 వన్డేల్లో 3576 పరుగులతో పాటు 192 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన క్లూసెనర్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. దీనికి తోడు తన బౌలింగ్‌తోనూ ప్రొటిస్‌కు చాలా మ్యాచ్‌ల్లో విజయాలు అందించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇక 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టులో క్లూసెనర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్ టై కావడం.. నెట్ రన్‌రేట్ ఆసీస్ కంటే తక్కువగా ఉన్న కారణంగా ప్రొటీస్ పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. ఇక 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం క్లూసెనర్ అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
వరల్డ్ కప్‌కు ముందు జింబాబ్వేకు భారీ షాక్
ఈనెల (అక్టోబర్ 16) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందు క్వాలిఫయర్ జట్టు జింబాబ్వేకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ మెగా టోర్నీకి ముందు జట్టుతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 7) ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు సైతం దృవీకరించింది. క్లూసెనర్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని క్రికెట్ జింబాబ్వే పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో క్లూసెనర్‌కు పలు దేశాల క్రికెట్ బోర్డులతో ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో జింబాబ్వేకు పూర్తి స్థాయి సేవలు అందించేందుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడని, అందుకే ఈ మేరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని క్లూసెనర్ ప్రతినిధి తెలిపాడు. కాగా, క్లూసెనర్ ఈ ఏడాది మార్చిలో జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు అతను 2016-2018 మధ్యకాలంలో కూడా జింబాబ్వే బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. క్లూసెనర్ హయాంలో జింబాబ్వే పూర్వపు స్థాయిలో విజయాలు సాధించి ఆకట్టుకుంది. జింబాబ్వే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో క్లూసెనర్ కీలకపాత్ర పోషించాడు. ఫ్లవర్ సోదరులు, అలిస్టర్ క్యాంప్‌బెల్ లాంటి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్ తర్వాత చతికిలబడిన జింబాబ్వేకు క్లూసెనర్ తన బ్యాటింగ్ మెళకువలతో పునరుజ్జీవం పోశాడు. ఇటీవలి కాలంలో సికిందర్ రాజా, క్రెయిగ్ ఐర్విన్, సీన్ విలియమ్స్ లాంటి ప్లేయర్లు రాటుదేలడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే, జింబాబ్వే జట్టు క్వాలిఫయర్స్‌లో మరో ఏడు జట్లతో కలిసి పోటీపడనుంది. క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లతో జింబాబ్వే అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫయర్ దశ మ్యాచ్‌లు అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు జరుగనుండగా.. సూపర్-12 మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.అక్టోబర్ 23న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య హైఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. -
దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్
CSA T20 League- సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ప్రొటిస్ యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ చరిత్ర సృష్టించాడు. కేప్‌టౌన్ వేదికగా సోమవారం జరిగిన ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు (9.2 మిలియన్ సౌతాఫ్రికన్ ర్యాండ్స్) చేసి 22 ఏళ్ల ఈ వపర్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ వేలంలో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమాకు చేదు అనుభవం ఎదురైంది. అతడి పేరు రెండుసార్లు వేలంలోకి వచ్చినా ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. కనీస ధర( 850,000 సౌతాఫ్రికన్ ర్యాండ్స్)కు కూడా కొనుగోలు చేయలేదు. బవుమాకు ఘోర అవమానం! ఈ విషయంపై స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, డర్బన్ సూపర్‌జెయింట్స్ కోచ్ లాన్స్ క్లూస్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి టీ20 లీగ్‌లలో ఆడాలంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ ట్యాగ్ సరిపోదని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సరైన గుర్తింపు ఉంటేనే ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ఐఓఎల్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి లీగ్‌లలో ఆడాలంటే తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశం తరఫున కీలక ఆటగాడు అయినంత మాత్రాన సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. అప్పుడే ఫ్రాంఛైజీలు సదరు ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటాయి’’ అని క్లూస్నర్ చెప్పుకొచ్చాడు. మరేం పర్లేదు! ఇక మరో మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘ఫ్రాంఛైజీ ఓనర్లు ఎలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయో మనకు తెలియదు కదా! అయినా.. ఇప్పుడే అంతా ముగిసిపోలేదు. టోర్నీ ఆరంభమయ్యే లోపు కొంతమంది గాయాల బారిన పడొచ్చు. లేదంటే మరో రూపంలో కూడా అవకాశం రావచ్చు’’ అంటూ బవుమాలా చేదు అనుభవం ఎదుర్కొన్న వారు నిరాశలో కూరుకుపోకూడదని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడిన బవుమా 120.6 స్ట్రైక్‌రేటుతో 562 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్ -
CSA T20 League: డర్బన్ ఫ్రాంచైజీ కోచ్‌గా ప్రొటిస్ మాజీ క్రికెటర్
South Africa T20 League- Lance Klusener: దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో పాల్గొనబోతున్న డర్బన్ ఫ్రాంచైజీకి మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ యజమానులైన ఆర్పీజీ గ్రూప్ డర్బన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. క్లూస్నర్ దక్షిణాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. 2004లో చివరిసారి సఫారీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అనంతరం అతను కోచ్‌గా మారాడు. కాగా వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో ఈ టీ20 లీగ్ నిర్వహించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా ప్రణాళికలు సిద్ధం చేసోతంది. ఇక ఇందులో మొత్తం ఆరు జట్లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా! -
T20 WC Ind Vs Pak: కోహ్లి వద్ద అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి.. కానీ
Lance Klusner on India-Pakistan T20 WC clash: దాయాది జట్లు టీమిండియా- పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తలపడబోయే రోజు కోసం క్రీడాభిమానులు సహా విశ్లేషకులు, మాజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఐసీసీ ఈవెంట్లో వలె ఈసారి కూడా పాక్‌పై మెన్ ఇన్ బ్లూ విజయపరంపర కొనసగుతుందా? లేదంటే మెన్ ఇన్ గ్రీన్ తమ అపజయాల పర్వానికి అడ్డుకట్ట వేయగలుగుతుందా? అన్న విషయాల గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, అఫ్గనిస్తాన్ కోచ్ లాన్స్ క్లూసెనర్ అక్టోబరు 24 నాటి మ్యాచ్ ఫలితం గురించి తన అభిప్రాయం పంచుకున్నాడు. పాకిస్తాన్‌ను ఓడించేందుకు కోహ్లి సేన అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉందని.. అయితే, తమదైన రోజున పాక్ చెలరేగి ఆడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఈ మేరకు... క్లూసెనర్ మాట్లాడుతూ... ‘‘భారత్, పాకిస్తాన్.. రెండూ బలమైన జట్లు. వాటి మధ్య మ్యాచ్ ఎల్లప్పుడూ ఆసక్తికరం. ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి పెద్ద ఈవెంట్లలో ఇరు జట్లు తలపడినపుడు అది మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. పాకిస్తాన్లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. విరాట్ కోహ్లి బృందం దగ్గర వాళ్లను ఓడించడానికి కావాల్సిన దానికంటే.. ఎక్కువే ‘అస్త్రాలు’ ఉన్నాయి. కానీ.. టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా... పాకిస్తాన్ చేతిలో భంగపాటు తప్పదు. తనదైన రోజున ప్రపంచంలోని ఏ జట్టునైనా పాక్ ఓడించగలదు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ఇక అఫ్గనిస్తాన్ గురించి క్లూసెనర్ మాట్లాడుతూ...‘‘ర్యాంకింగ్స్‌లో మేం మరింత మెరుగుపడాలంటే.. ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ వంటి జట్లతో జరిగే మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలగాలి. శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం -
IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది!
Lance Klusener Comments On IPL Winner: ఐపీఎల్-2021 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నుంచి ప్లే ఆఫ్స్ షెడ్యూల్ మొదలుకానుంది. అక్టోబరు 10న క్వాలిఫయర్-1, అక్టోబరు 11న ఎలిమినేటర్, అక్టోబరు 13న క్వాలిఫయర్-2, అక్టోబరు 15న ఫైనల్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిస్తే చూడాలని ఉందన్నాడు. ఆర్సీబీ ట్రోఫీ సాధించాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘విరాట్, ఏబీ వంటి వంటి స్టార్ ప్లేయర్లు ఒకే జట్టులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ జట్టు(ఆర్సీబీ) ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ విషయం మా మనసును కలిచివేస్తోంది. బెంగళూరు కప్ గెలిస్తే బాగుంటుంది. ఈసారి వాళ్లు కచ్చితంగా విజేతలుగా నిలుస్తారని భావిస్తున్నా. ఒక్కసారైనా వాళ్లు ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచిన ఆర్సీబీ... శుక్రవారం నాటి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వైజాగ్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్.. చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలిచి చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక 9 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కోహ్లి సేన అక్టోబరు 11న.. షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తే క్వాలియర్-1లో ఓడిన జట్టుతో ఆర్సీబీ.. క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఇక ఈ సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: IPL 2021: టీ20 వరల్డ్‌కప్ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా! MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ -
నెల వ్యవధిలోనే హెడ్ కోచ్ అయిపోయాడు!
కాబూల్: గత నెలలో దక్షిణాఫ్రికా అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించబడ్డ ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్‌కు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. తాజాగా లాన్స్ క్లూసెనర్‌ను తమ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమిస్తూ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అఫ్గాన్ క్రికెట్ హెడ్ కోచ్‌గా పని చేసిన ఫిల్ సిమ్మన్స్ స్థానంలో క్లూసెనర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. సిమ్మన్స్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఇటీవల కోచ్ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అందుకు క్లూసెనర్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న క్లూసెనర్ తాను కూడా ఉన్నానంటూ దరఖాస్తు చేశాడు. అఫ్గాన్ హెడ్ కోచ్ పదవి కోసం అప్లై చేసిన తరుణంలోనే దక్షిణాఫ్రికా అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా క్లూసెనర్ ఎంపికయ్యాడు క్లూసెనర్. దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న తరుణంలో ఆగస్టు నెలలో క్లూసెనర్‌కు అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ పగ్గాలు అప్పచెప్పారు. నెల వ్యవధిలోనే అసిస్టెంట్ కోచ్ పేరు కాస్త హెడ్ కోచ్‌గా మారిపోవడంతో క్లూసెనర్ ఉబ్బితబ్బి అయిపోతున్నాడు. ‘నన్ను అఫ్గాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడం చాలా గర్వంగా ఉంది. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ టాలెంట్ ఉన్న అఫ్గాన్‌తో కలిసి పని చేయడానికి ఆతృతగా ఉన్నాడు. ఇది నాకు వచ్చిన మంచి అవకాశం. ప్రతీ ఒక్కరికీ ఫియర్లెస్ బ్రాండ్‌గా ముద్ర పడిన అఫ్గాన్ క్రికెట్ గురించి తెలుసు. ఆ జట్టును ఉన్నత స్థాయిలో నిలపడమే నా ముందున్న లక్ష్యం’ అని క్లూసెనర్ పేర్కొన్నాడు. -
‘అలాంటి భారత బౌలర్‌ని చూడలేదు’
మొహాలీ: టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీపై దక్షిణాఫ్రికా అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టుకు అతను భవిష్య ఆశాకిరణమని కొనియాడాడు. ప్రధానంగా షైనీ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని ప్రస్తావించిన క్లూసెసర్.. ఈ తరహా వేగంతో బౌలింగ్ చేసే భారత బౌలర్‌ని ఎన్నడూ చూడలేదన్నాడు. గతంలో డీడీసీఏతో కలిసి పని చేసిన క్లూసెనర్.. ఢిల్లీ బౌలర్ అయిన షైనీ ప్రతిభను ఎప్పుడో గుర్తించిన్టుల పేర్కొన్నాడు. దాంతో ప్రస్తుతం షైనీ బౌలింగ్ ఏమీ తనను ఆశ్చర్యానికి గురి చేయడం లేదని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు. ‘నాకు తెలిసి షైనీది ఒక అద్భుతమైన బౌలింగ్ యాక్షన్. అతని యాక్షన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. దాంతో వేగవంతమైన బౌలింగ్ చేయడానికి ఫిట్ అయ్యాడు. నేను అతనితో ఎప్పుడు మాట్లాడినా ఫాస్టెస్ట్ బౌలింగ్‌కే మొగ్గుచూపేవాడు’ అని క్లూసెనర్ పేర్కొన్నాడు.వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన షైనీ ఆకట్టుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సైతం షైనీని ఎంపిక చేశారు. కాకపోతే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు మాత్రం షైనీకి చోటు దక్కలేదు. దీనిపై షైనీ మాట్లాడుతూ.. ‘ టెస్టు ఫార్మాట్లో మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. వెస్టిండీస్‌తో సిరీస్ జరిగినప్పుడు ఈ విషయాన్ని నేను గమనించా. నాకు టెస్టు జట్టులో చోటు దక్కాలంటే మరింత శ్రమించాల్సి ఉంది. అప్పుడే నాకు అవకాశం వస్తుంది’ అని షైనీ పేర్కొన్నాడు. -
క్లూసెనర్ కొత్త ఇన్నింగ్స్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. టీమిండియాతో త్వరలో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు సీఎస్ఏ స్పష్టం చేసింది. అదే సమయంలో మాజీ పేసర్ విన్సెంట్ బార్న్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసిన్టుల తెలిపింది. ‘వారి ప్రతిభను పరిగణలోకి తీసుకునే ఈ ఎంపిక జరిగింది. బ్యాటింగ్ అసిస్టెంట్‌గా క్లూసెనర్ సమర్ధుడనే భావించే అతన్ని ఎంపిక చేశాం. అతను కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతానికి క్లూసెసన్ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండడు’ అని దక్షిణాఫ్రికా డైరక్టర్ కోరీ వాన్ పేర్కొన్నారు. -
హార్దిక్‌ను ఏకంగా అతడితో పోల్చిన స్టీవ్ వా
లండన్ : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆటకు తాను మంత్ర ముగ్దుడిని అయ్యానని కొనియాడాడు. అంతేకాకుండా ఏకంగా దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ లాన్స్ క్లుసెనర్తో హార్దిక్‌ను పోల్చాడు. బలమైన ఆసీస్ బౌలింగ్‌లో కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు రాబట్టి టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి ఈ ఆల్‌రౌండర్ సహకరించాడని పేర్కొన్నాడు. ‘ఈ టోర్నీలో హార్దిక్ ఆటను చూస్తుంటే 1999 ప్రపంచకప్‌లో సఫారీ ఆల్‌రౌండర్ క్లుసెనర్ గుర్తుకొస్తున్నాడు. టీ20లు లేనిసమయంలోనే ధాటిగా ఆడేవాడు. ఎదుర్కొనే తొలి బంతి నుంచి చివరి బంతి వరకు హిట్టింగ్ చేయాలనే ఆడతారు ఇద్దరూ. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి జట్టు సారథి ఆత్మరక్షణలో పడతాడు. ప్రస్తుతం హార్దిక్ టైం నడుస్తోంది. ఇక టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఆటగాళ్లు రాణించారు. అది టీమిండియాకు శుభపరిణామం. కోహ్లి, ధోనిల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆసీస్ నిరుత్సాహపరిచింది.. టీమిండియాపై ఆసీస్ ఆటగాళ్లు ఆడిన తీరు నిరుత్సాహపరిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చాలా పొరపాట్లు చేశారు. వార్నర్, స్మిత్‌లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేస్తే బెటర్’అంటూ స్టీవ్ వా పేర్కొన్నాడు. ఇక 1999 ప్రపంచకప్‌లో క్లుసెనర్ 122.17 స్ట్రైక్‌రేట్‌తో 281 పరుగులు చేసి సఫారీ విజయాలలో కీలకపాత్ర పోషించాడని, టీ20లు లేని కాలంలోనే అంత స్ట్రైక్ రేట్ మెయింటేన్ చేయడం మామూలు విషయం కాదని స్టీవ్‌వా చెప్పుకొచ్చాడు. -
ఫిలాండర్‌ను ఇలా దెబ్బకొట్టండి.. లేదంటే మళ్లీ నష్టం!
కేప్‌టౌన్: ఇటీవల కేప్‌టౌన్‌లో జరిగిన తొలిటెస్టులో భారత క్రికెట్ జట్టు పతనాన్ని శాసించాడు దక్షిణాఫ్రికా పేసర్ వెర్నాన్ ఫిలాండర్. ముఖ్యంగా కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 6/42తో కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు ఫిలాండర్. స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా టెస్టు మధ్యలోనే వైదొలిగినా.. ఫిలాండర్ చెలరేగడంతో సఫారీలకు ఆ లోటు తెలియలేదు. అయితే రెండో టెస్టులో విజయం సాధించి కేప్‌టౌన్ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోన్న విరాట్ కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ కొన్ని విలువైన చిట్కాలు చెప్పాడు. వైవిధ్యమైన బంతులతో తొలిటెస్టులో ఇబ్బంది పెట్టిన పేసర్ ఫిలాండర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలుపట్టుకుంటున్న భారత బ్యాట్స్మెన్లకు క్లూసెనర్ సూచనలు ఫలితాన్ని ఇవ్వనున్నాయి. అత్యంత వేగంగా బంతులు సంధించే బౌలర్లను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి ఆటగాళ్లు క్రీజు నుంచి బయటకు వచ్చి ఆడటం ఉత్తమమని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మీటరు దూరం వరకు క్రీజునుంచి ముందుకొచ్చి ఫిలాండర్ బంతులను ఎదుర్కొంటే ఔటయ్యే సమస్యకు దూరంగా ఉంటూ పరుగులు సాధించవచ్చునని సూచించాడు. కనీసం అరమీటరు ముందుకొచ్చి స్టాన్స్ తీసుకుని పేసర్ల బంతులు ఆడితే బౌలర్ల లయ దెబ్బతిని షార్ట్ లెంగ్త్‌తో బంతులు వేస్తారు. మిగతా రెండు టెస్టులు ఆడే బౌన్సీ పిచ్‌లపై తన చిట్కాలు ఆచరించినా దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొని విజయం సాధిస్తారన్న నమ్మకం లేదన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ అతికష్టమ్మీద 1-0తో ఔటమితో గానీ లేక 1-1తో సిరీస్ సమం చేయొచ్చునని క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్లూసెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆధునిక క్రికెట్లో హార్దిక్ తనదైన మార్కును చూపిస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడంటూ కొనియాడాడు. భారత క్రికెట్ జట్టకు దొరికిన ఒక వరంగా హార్దిక్‌ను అభివర్ణించాడు. పేస్ బౌలింగ్‌లో ఇంకా వైవిధ్యాన్ని కనబరిస్తే ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎదుగుతాడని క్లూసెనర్ పేర్కొన్నాడు. -
'భారత జట్టుకు అతనొక వరం'
కేప్‌టౌన్: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆధునిక క్రికెట్లో హార్దిక్ తనదైన మార్కును చూపిస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడంటూ కొనియాడాడు. భారత క్రికెట్ జట్టకు దొరికిన ఒక వరంగా హార్దిక్‌ను క్లూసెనర్ అభివర్ణించాడు. 'భారత జట్టులో అద్బుతమైన ఆల్ రౌండర్ హార్దిక్. చాలా స్వల్ప కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అదే క్రమంలో టీమిండియా రెగ్యులర్ సభ్యనిగా మారిపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ది కచ్చితంగా అద్వితీయమైన ఇన్నింగ్సే. భారత జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో హార్దిక్ ఆడిన తీరు నిజంగా అద్భుతం. అతని ఆట తీరుతో మా జట్టును ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశాడు. అతను పేస్ బౌలింగ్‌లో ఇంకా వైవిధ్యాన్ని కనబరిస్తే ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎదుగుతాడు' అని క్లూసెనర్ పేర్కొన్నాడు.