దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ త్రిపుర క్రికెట్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ శనివారం(జూన్ 3న) త్రిపుర క్రికెట్ కన్సల్టెంట్ పదవిని స్వీకరించనున్నాడు. ఇప్పటికే అగర్తల చేరుకున్న క్లూసెనర్ రానున్న దేశవాలీ క్రికెట్ సీజన్‌లో భాగంగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండనున్నాడు.
త్రిపుర జట్టు కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ తొలుత 100 రోజుల సీజన్‌కు అందుబాటులో ఉంటాడని.. 20 రోజులు అగర్తల క్యాంప్‌లో ఉండి జట్టును పర్యవేక్షిస్తాడని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తిమిర్ చందా పేర్కొన్నాడు. కాగా కన్సల్టెంట్ పోస్టుకు మా వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన చేశాం. ఈ పదవి చేపట్టేందుకు డేవ్ వాట్‌మోర్ సహా లాన్స్ క్లూసెనర్‌లు ఆసక్తి చూపించారు. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా డేవ్ వాట్‌మోర్ రేసు నుంచి తప్పుకోవడంతో లాన్స్ క్లూసెనర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అంటూ చెప్పకొచ్చాడు.
కాగా కొన్నేళ్ల క్రితం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఒక ఫ్రాంచైజీకి క్లూసెనర్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇక అంతర్జాతీయంగా 1996 నుంచి 2004 వరకు దక్షిణాఫ్రికా తరపున ఆడిన క్లూసెనర్ 49 టెస్టుల్లో 1906 పరుగులతో పాటు 80 వికెట్లు, 171 వన్డేల్లో 3576 పరుగులతో పాటు 192 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ వచ్చిన క్లూసెనర్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. దీనికి తోడు తన బౌలింగ్‌తోనూ ప్రొటిస్‌కు చాలా మ్యాచ్‌ల్లో విజయాలు అందించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.
ఇక 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టులో క్లూసెనర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్ టై కావడం.. నెట్ రన్‌రేట్ ఆసీస్ కంటే తక్కువగా ఉన్న కారణంగా ప్రొటీస్ పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. ఇక 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం క్లూసెనర్ అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment