Former India Pacer RP Singh Senior Son Harry Makes England U-19 Debut - Sakshi
Sakshi News home page

Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్‌​ కుమారుడు

Published Fri, Aug 5 2022 9:18 AM | Last Updated on Fri, Aug 5 2022 10:35 AM

Former India Pacer RP Singh Senior Son Harry Makes England U-19 Debut - Sakshi

టీమిండియా మాజీ పేసర్‌ రుద్రప్రతాప్‌ సింగ్‌ (సీనియర్‌) కుమారుడు హ్యారీ సింగ్‌ ఇంగ్లండ్‌ తరపున అండర్‌-19 క్రికెట్‌ ఆడనున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక అండర్‌-19 సిరీస్‌కు హ్యారీ సింగ్‌ ఎంపికయ్యాడు. కొన్నాళ్ల నుంచి హ్యారీ సింగ్‌తన బ్యాటింగ్‌తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అండర్‌-19లో రాణిస్తే.. సీనియర్‌ ఇంగ్లండ్‌ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండడంతో హారి సింగ్‌కు ఇది కీలకం కానుంది. కాగా హ్యారీ సింగ్‌ లంకాషైర్‌ జూనియర్‌ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

కాగా అండర్‌-19కు ఎంపికైన తన కుమారుడిపై సీనియర్‌ ఆర్‌పీ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెక్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' కొద్ది రోజుల క్రితం, ఇంగ్లండ్ అండర్‌-19 జట్టుకు హ్యారీని ఎంపిక చేసినట్లు ఈసీబీ నుంచి కాల్ వచ్చింది. శ్రీలంక అండర్‌-19 జట్టుతో స్వదేశంలోనే ఈ సిరీస్‌ ఆడనుంది. అయితే హారీ ఎంపిక అంత సులభంగా కాలేదు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంచెం అదృష్టంతో పాటు పరుగులు చేయడం కూడా అవసరం. 90వ దశకంలో మన భారత్‌లో దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్న చాలా మంది క్రికెటర్లను చూశాను. కానీ వారు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఘోరంగా విఫలమయ్యారు. హ్యారీ ఎదుగుతున్న కొద్దీ.. ప్రతి క్రికెటర్ చేసే టెక్నికల్ సర్దుబాట్లను చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.'' అని పేర్కొన్నాడు.


కూతురు, కుమారుడితో మాజీ క్రికెటర్‌ రుద్రప్రతాప్‌ సింగ్‌ సీనియర్‌

ఇక  లక్నోకు చెందిన సీనియర్‌ రుద్రప్రతాప్‌ సింగ్‌(ఆర్‌పీ సింగ్‌) 1986లో టీమిండియా తరపున ఆస్ట్రేలియాతో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు‌. కేవలం రెండు వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే అతను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కపిల్‌దేవ్‌ కెప్టెన్సీలోనే ఆర్‌పీ సింగ్‌ ఈ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక దేశవాలీ క్రికెట్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు ఆడిన ఆర్‌పీ సింగ్‌ 59 ఫస్ట్‌క్లాస్‌, 21 లిస్ట్‌ -ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆర్‌పీ సింగ్‌ బ్రిటన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి లండన్‌లోనే సెటిలయ్యాడు. కాగా ఆర్‌పీ సింగ్‌ కూతురు కూడా మెడిసిన్‌ చదవడానికి ముందు లంకాషైర్‌ తరపున అండర్‌-19 క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించింది.

మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. సీనియర్‌ ఆర్‌పీ సింగ్‌ అరంగేట్రం చేసిన 19 ఏళ్లకు.. అంటే 2005లో టీమిండియా తరపున మరో ఆర్‌పీ సింగ్‌(రుద్రప్రతాప్‌ సింగ్‌) అరంగేట్రం చేశాడు. ఇతనికి కూడా ఉత్తర్‌ప్రదేశ్‌ కావడంతో.. సీనియర్‌ ఆర్‌పీ సింగ్‌కు బంధువు అని చాలా మంది అనుకున్నారు. కానీ సీనియర్‌ ఆర్‌పీ సింగ్‌తో.. జూనియర్‌ ఆర్‌పీ సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇక జూనియర్‌ ఆర్‌పీ సింగ్‌ టీమిండియా తరపున 2005-2011 వరకు బౌలింగ్‌లో ఆర్‌పీ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. టీమిండియా గెలిచిన 2007 టి20 వరల్డ్‌కప్‌ జట్టులో ఆర్‌పీ సింగ్‌ సభ్యుడు. అంతేకాదు ఆ టోర్నీలో రెండో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. 2018లో ఆర్‌పీ సింగ్‌ అన్ని ఫార్మాట్లు సహా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: Asia Cup 2022: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి!

Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement