మనలో సైన్స్ తెలిసినోళ్లు జోతిష్యం గుడ్డిగా నమ్మరు. అది అలా చేస్తేనే జరుగుతుంది... ఇది ఇలా చేస్తేనే జరుగుతుంది అని కొంతమంది చేసే వితండవాదాన్ని సైన్స్‌ను నమ్మేటోళ్లు కొట్టిపారేయడం చూస్తుంటాం. కానీ కొన్ని విషయాలు మాత్రం మనల్ని నమ్మించేలా ఉంటాయి. క్రీడలు కూడా అందుకు అతీతం కాదని చెప్పొచ్చు. ఇలాంటివి ఫుట్‌బాల్‌లో చూశాం.
గతంలో 2010 ఫిఫా వరల్డ్‌కప్ సమయంలో ఒక ఆక్టోపస్‌ను తీసుకొచ్చి ఏ జట్టు గెలుస్తుందో చెప్పమంటే అది స్పెయిన్ జెండాను ముట్టుకుంది. నిజంగానే ఆ ఏడాది స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. అంతకముందు ఇటలీ 2006లో విశ్వవిజేతగా నిలిచింది. ఈ రెండు సందర్భాల్లో ఆక్టోపస్ జోస్యం నిజం కావడంతో దానిని అదృష్ట దేవతగా పిలవడం మొదలెట్టారు.
తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విషయంలోనూ ఒక విషయం టీమిండియాదే ఈసారి వరల్డ్‌కప్ అని జోస్యం చెబుతుంది. అదేంటంటే 2011 నుంచి చూసుకుంటే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాలే విజేతగా నిలుస్తూ వస్తున్నాయి. 2011లో టీమిండియా రెండోసారి విజేతగా అవతరిస్తే.. 2015లో మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఇక 2019లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను బౌండరీ కౌంట్ తేడాతో ఓడించి ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఈ లెక్కన 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్ ఈసారి వరల్డ్‌కప్‌ను కొల్లగొట్టబోతుందని కొంతమంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమయితే మాత్రం టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్ కొట్టడం ఖాయం. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు.
టీమిండియా ఫెవరెట్‌గా ఉన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఏ దేశమైనా చెలరేగి ఆడడం వారి నైజం. అందునా ఆస్ట్రేలియా జట్లు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇటీవలే డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ గెలిచి ఉత్సాహంతో ఉన్న ఆసీస్ భారత్ గడ్డపై వన్డే వరల్డ్‌కప్ గెలవాలన్న కసితో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా డిపెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలనే దృడ సంకల్పంతో ఉంది.
అటు వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రం ఈసారి కప్ కొట్టాలనే సంకల్పంతో బరిలోకి దిగుతుంది. ఇక రోహిత్ సారధ్యంలోని టీమిండియా పేపర్‌పై బలంగా కనిపిస్తోంది. కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తే టీమిండియాకు విజేతగా నిలవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఎంతవరకు నిలకడ ఉందనేది క్లారిటీ లేదు. అయినా సరే మెగా టోర్నీకి మనం ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి టీమిండియా మూడో వరల్డ్‌కప్ గెలవాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment