ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ తాజాగా విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో (32) రూట్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి, ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11వ స్థానానికి, టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11940) ఎగబాకాడు.
టెస్ట్‌ల్లో 32 సెంచరీలు పూర్తి చేసిన అనంతరం రూట్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రూట్ అతి త్వరలో ఇంగ్లండ్ లీడింగ్ టెస్ట్ రన్ స్కోరర్‌గా అవతరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో రూట్ సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా సవరిస్తాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రూట్ వయసు 33 ఏళ్లే అని.. మరో రెండు,మూడేళ్లలో సచిన్ రికార్డు బద్దలు కావడం ఖాయమని జోస్యం చెప్పాడు.
కాగా, రూట్ ప్రస్తుతం అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. కలిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), ద్రవిడ్ (36), యూనిస్ ఖాన్ (34), గవాస్కర్ (34), లారా (34), జయవర్దనే (34), కుక్ (33) రూట్ కంటే ముందున్నారు. రూట్ మరో సెంచరీ చేస్తే.. తన దేశ అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్ అలిస్టర్ కుక్ రికార్డును సమం చేస్తాడు.
అలాగే రూట్ మరో 54 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ లారాను (11953) అధిగమించి ఏడో స్థానానికి ఎగబాకుతాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్‌లో ఉండగా.. పాంటింగ్ (13378), కలిస్ (13289), ద్రవిడ్ (13288), కుక్ (12472), సంగక్కర (12400), లారా మాత్రమే రూట్ కంటే ముందున్నారు. జులై 26 నుంచి విండీస్‌తో జరుగబోయే చివరి టెస్ట్‌లో రూట్ పై పేర్కొన్న వాటిలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment