PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్‌ | PAK Vs ENG 1st Test: Joe Root Became The First Player To Complete 5000 Runs In WTC History, Know His Runs Details | Sakshi
Sakshi News home page

PAK VS ENG 1st Test: చరిత్ర సృష్టించిన జో రూట్‌

Published Tue, Oct 8 2024 9:01 PM | Last Updated on Wed, Oct 9 2024 11:27 AM

PAK VS ENG 1st Test: Root Became The First Player To Complete 5000 Runs In WTC History

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల వద్ద బ్యాటింగ్‌ కొనసాగిస్తున్న రూట్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడిన రూట్‌ 51.59 సగటుతో 5005 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 20 అర్ద శతకాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రూట్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్నస్‌ లబూషేన్‌ ఉన్నాడు. లబూషేన్‌ ఇప్పటివరకు 3904 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత కూడా రూట్‌కే దక్కుతుంది.

డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు..
రూట్‌-5005
లబూషేన్‌-3904
స్టీవ్‌ స్మిత్‌-3486
బెన్‌ స్టోక్స్‌-3101
బాబర్‌ ఆజమ్‌-2755

ఎడిషన్ల వారీగా రూట్‌ చేసిన పరుగులు..
2019-21లో 1660 పరుగులు
2021-23లో 1915 పరుగులు
2023-25లో 1490 పరుగులు

రూట్‌ ఖాతాలో మరో రికార్డు..
తాజా ఇన్నింగ్స్‌తో రూట్‌ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్‌ ఐదోసారి క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ అత్యధికంగా ఆరు సార్లు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగలు పూర్తి చేశాడు. రూట్‌.. బ్రియాన్‌ లారాతో (5) కలిసి ఐదు సార్లు ఈ ఘనతను సాధించాడు. రూట్‌ ఈ ఏడాది 1018 పరుగులు (21 ఇన్నింగ్స్‌ల్లో) చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ భారీ స్కోర్‌ చేసింది. అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్‌ అయూబ్‌ 4, బాబర్‌ ఆజమ్‌ 30, నసీం షా 33, మొమహ్మద్‌ రిజ్వాన్‌ 0, ఆమెర్‌ జమాల్‌ 7, షాహీన్‌ అఫ్రిది 26, అబ్రార్‌ అహ్మద్‌ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో రెండు.. క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆదిలోనే కెప్టెన్‌ ఓలీ పోప్‌ వికెట్‌ను కోల్పోయింది. పోప్‌ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్‌ జమాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 96/1గా ఉంది. జాక్‌ క్రాలే (64), జో రూట్‌ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది.

చదవండి: నవంబర్‌ 17 నుంచి దిగ్గజాల క్రికెట్‌ లీగ్‌.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్‌


 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement