టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్‌ | England Registered Fourth Highest Total In Test Cricket Against Pakistan In Multan Test | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్‌

Published Thu, Oct 10 2024 5:55 PM | Last Updated on Thu, Oct 10 2024 6:18 PM

England Registered Fourth Highest Total In Test Cricket Against Pakistan In Multan Test

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్‌ నమోదైంది. ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ​ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక​ టీమ్‌ స్కోర్‌ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 

1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక​ స్కోర్లు కూడా ఇంగ్లండ్‌ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్‌ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌, పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్‌లో పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్‌ షకీల్‌ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో రెండు.. క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 823/7 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. జో రూట్‌ (262), హ్యారీ బ్రూక్‌ (317) డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్‌ క్రాలే (78), బెన్‌ డకెట్‌ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో నసీం షా, సైమ్‌ అయూబ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్‌ అఫ్రిది, ఆమెర్‌ జమాల్‌, అఘా సల్మాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

267 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ 0, సైమ్‌ అయూబ్‌ 25, షాన్‌ మసూద్‌ 11, బాబర్‌ ఆజమ్‌ 5, సౌద్‌ షకీల్‌ 29, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 10 పరుగులు చేసి ఔట్‌ కాగా.. అఘా సల్మాన్‌ (36), అమెర్‌ జమాల్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ తలో రెండు, క్రిస్‌ వోక్స్‌, జాక్‌ లీచ్‌ చెరో వికెట్‌ తీసి పాక్‌ పుట్టి ముంచారు.

చదవండి: బాబర్‌ ఆజమ్‌.. ఇక మారవా..?

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement