అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్‌.. టెస్ట్‌ల్లో 35వ సెంచరీ | PAK VS ENG 1st Test: Joe Root Completes 35th Century | Sakshi
Sakshi News home page

PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్‌లో జో రూట్‌.. 35వ సెంచరీ

Published Wed, Oct 9 2024 3:03 PM | Last Updated on Wed, Oct 9 2024 4:03 PM

PAK VS ENG 1st Test: Joe Root Completes 35th Century

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ టెస్ట్‌ క్రికెట్లో‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రూట్‌ గత మూడేళ్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌లో రూట్‌ 2021 నుంచి 16 హాఫ్‌ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. ఈ మధ్యకాలంలో టెస్ట్‌ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.

రూట్‌ ఖాతాలో 35వ సెంచరీ
తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్‌ మరో సెంచరీతో మెరిశాడు. రూట్‌కు టెస్ట్‌ల్లో ఇది 35వ సెంచరీ. ఈ సెంచరీతో రూట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలో రూట్‌ సునీల్‌ గవాస్కర్‌, బ్రియాన్‌ లారా, మహేళ జయవర్దనే, యూనిస్‌ ఖాన్‌ లాంటి దిగ్గజాలను అధిగమించాడు. పైన పేర్కొన్న వారంతా టెస్ట్‌ల్లో తలో 34 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్‌ టెండూల్కర్‌  పేరిట ఉంది.

టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు..
సచిన్‌-51
కల్లిస్‌-45
పాంటింగ్‌-41
సంగక్కర-38
ద్రవిడ్‌-36
రూట్‌-35*

ఈ ఏడాది ఐదో సెంచరీ
రూట్‌ టెస్ట్‌ల్లో తన రెడ్‌ హాట్‌ ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు. తాజా సెంచరీతో కలుపుకుని రూట్‌ ఈ ఏడాది ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఏడాది టెస్ట్‌ల్లో రూట్‌, కమిందు మెండిస్‌ మాత్రమే ఐదు సెంచరీలు చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్తాన్‌ వేదికగా మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రూట్‌ (104), హ్యారీ బ్రూక్‌ (59) క్రీజ్‌లో ఉన్నారు. జాక్‌ క్రాలే (78), ఓలీ పోప్‌ (0), బెన్‌ డకెట్‌ (84) ఔటయ్యారు. అంతకుముందు పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది.

పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్‌ షకీల్‌ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో రెండు.. క్రిస్‌ వోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జో రూట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

చదవండి: T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement