హాకీ కొత్త కోచ్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్ పాల్ వాన్ యాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ ఆధ్వర్యంలో భారత జట్టు సభ్యులు మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆదివారం అధికారికంగా తన విధుల్లోకి చేరిన పాల్ జట్టు బాధ్యతలను మాత్రం సోమవారం స్వీకరించారు. తొలి రోజున ఉదయం ఆటగాళ్లతో పరిచయం చేసుకున్న ఆయన రెండు గంటలపాటు ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించారు.
వచ్చే నెలలో మలేసియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్ కోసం భారత్ సిద్ధమవుతోంది. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ద్వారా నియమితుడైన 54 ఏళ్ల పాల్ కాంట్రాక్ట్ 2018 ప్రపంచకప్ వరకు ఉంది. క్రీడాకారుడిగా చెప్పుకోతగ్గ చరిత్రలేని పాల్ కోచ్‌గా నెదర్లాండ్స్ జట్టుకు 2012 లండన్ ఒలింపిక్స్‌కు రజత పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.