Paul van Ass
-
పిలిస్తే... మళ్లీ వస్తాను
నా విధుల్లో జోక్యం చేసుకోవద్దు: హాకీ కోచ్ పాల్ వాన్ యాస్ న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధికారులు మళ్లీ చీఫ్ కోచ్ పదవి చేపట్టాలని ఆహ్వానిస్తే... భారత్‌కు తిరిగి వస్తానని పాల్ వాన్ యాస్ తెలిపారు. తాను చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలగలేదని, తనపై హాకీ ఇండియా అధికారులే వేటు వేసి తప్పించారని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను. ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను ఆహ్వానిస్తారని అనుకోను. గతవారమే నాపై వేటు వేశారు. అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నాను. ఏదీ జరిగినా నాకు సమ్మతమే. నా పదవి నుంచి దిగిపోయానని నేనెప్పుడూ చెప్పలేదు. నన్ను తప్పిస్తే నేనేం చేయాలి’ అని ప్రస్తుతం తన స్వస్థలం నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో ఉన్న పాల్ వాన్ యాస్ వివరించారు. ‘చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాలని మళ్లీ కోరితే తప్పకుండా వస్తాను. అయితే దీనికి ముందు చాలా విషయాలపై చర్చ జరగాలి. నేను ముక్కుసూటి మనిషిని. నా కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. నేను మంచి కోచ్ కాదు అని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వ్యాఖ్యానించారని తెలిసింది. తెలియని విషయాలపై బాత్రా అంచనాకు రాకూడదు. హాకీపై ఆయనకు అవగాహన లేదని ఇలాంటి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని పాల్ తెలిపారు. ‘రియో ఒలింపిక్స్‌లో టీమిండియా నుంచి అద్భుతం చేసి చూపించాలనే తాపత్రయంతో చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాను. భారత ఆటగాళ్లతో పనిచేసిన కాలం అద్భుతంగా సాగింది. భారత ఆటగాళ్లందరిలో సహజసిద్ధ నైపుణ్యం ఉంది. తనపై వేటు వేసిన విషయానికి సంబంధించిన పత్రాలను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులకు మెయిల్ చేశాను. వారి ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నాను’ అని పాల్ వాన్ యాస్ వివరించారు. -
వెళ్లగొట్టారు...!
భారత చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్‌ను తొలగించిన హాకీ ఇండియా - అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో విభేదాలే కారణం! - రియో ఒలింపిక్స్ సన్నాహకాలపై ప్రభావం న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ఏడాది ముందు భారత హాకీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు నెలల క్రితమే చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాల్ వాన్ యాస్పై హాకీ ఇండియా వేటు వేసింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వాన్ యాస్‌కు జట్టుతో మూడేళ్ల ఒప్పందం ఉంది. 2018 పురుషుల హాకీ ప్రపంచకప్ వరకు ఆయన కొనసాగాల్సి ఉంది. ఆదివారం షిలరూలోని సాయ్ సెంటర్లో హాకీ జట్టు శిబిరం ప్రారంభం కాగా కోచ్ హాజరు కాలేదు. అప్పుడే ఆయన భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే హాకీ వరల్డ్ లీగ్ సెమీస్‌లో జట్టు ప్రదర్శనపై కూడా ఆయన నివేదిక సమర్పించలేదు. మరో కథనం ప్రకారం హాకీ వరల్డ్ లీగ్‌లో మలేసియాతో జరిగిన క్వార్టర్స్ అనంతరం హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో మాట్లాడాడు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోచ్ వాన్ ఆయనపై వాదనకు దిగారు. కోచ్‌గా తానుండగా ఆటగాళ్లతో మీరు మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తూ.. వెంటనే మైదానం వీడాలని సూచించారు. అప్పటినుంచే హెచ్ఐ అధ్యక్షుడితో దూరం పెరిగినట్టు సమాచారం. నిజానికి హాకీ జట్టుకు విదేశీ కోచ్‌లు అచ్చిరావడం లేదనే చెప్పుకోవచ్చు. గతంలో గెరార్డ్ రాచ్, జోస్ బ్రాసా, మైకేల్ నాబ్స్, టెర్రీ వాల్ష్ కూడా ఏదో ఒక రీతిన జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలపై మాజీ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాన్‌ను తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘మా ఆటపై ప్రభావం పడుతుంది’: మరోవైపు ఇలా చీటికిమాటికి కోచ్‌లను మారుస్తూ ఉంటే తమ ఆటపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఓ సీనియర్ ఆటగాడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా తమ ఒలింపిక్స్ సన్నాహకాలను దెబ్బతీస్తుందని అన్నాడు. ఏ కోచ్తోనైనా సమన్వయం అయ్యేందుకు కాస్త సమయం పడుతుందని, మరో ఏడాదిలో రియో ఒలిం పిక్స్ ఉండగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం అయోమయంగా ఉందని చెప్పాడు. నన్ను షూట్ చేశారు: వాన్ ఆస్ కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ముందే అంచనా వేశానని హాలెండ్‌కు చెందిన పాల్ వాన్ యాస్ తెలిపారు. ఓరకంగా హాకీ ఇండియా తనను షూట్ చేసిందని ఆరోపించారు. ‘నాకు తెలిసినంత వరకు హాకీ వరల్డ్ లీగ్ సెమీస్ ముగిసిన వారం అనంతరమే నాపై ఫైరింగ్ జరిగింది. జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలంట్ ఓల్టమన్స్కు నన్ను రీప్లేస్ చేయమని సూచించారు. నన్ను కోచ్‌గా నియమించడం బాత్రాకు నచ్చలేదని అప్పట్లోనే రోలంట్ నాకు చెప్పారు. ఉద్వాసన గురించి కూడా ఆయనే నాకు చెప్పారు. హెచ్ఐ నుంచి ఎలాంటి లేఖ అందలేదు. దీనికి బాత్రాతో జరిగిన గొడవే కారణం. ఆరోజు క్వార్టర్స్ ముగిశాక బాత్రా మైదానంలోకి వచ్చి హిందీలో ఆటగాళ్లతో మాట్లాడాడు. వారిని ప్రశంసిస్తున్నాడేమో అనుకున్నా. కానీ ఆయన వారిని విమర్శిస్తున్నారు. అందుకే నేను జోక్యం చేసుకున్నాను. మైదానం నా ఏరియా. ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాపై ఉంది. మేం ఆ రోజు బాగా ఆడి గెలిచామనే అభిప్రాయంతో నేనున్నాను. తిరిగి బాధ్యతలు తీసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కోచ్ పద వి నుంచి నేను తప్పుకోవడం లేదు. వారే బయటికి పంపిస్తున్నారు’ అని వాన్ యాస్ స్పష్టం చేశారు. -
హాకీ కొత్త కోచ్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్ పాల్ వాన్ యాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ ఆధ్వర్యంలో భారత జట్టు సభ్యులు మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆదివారం అధికారికంగా తన విధుల్లోకి చేరిన పాల్ జట్టు బాధ్యతలను మాత్రం సోమవారం స్వీకరించారు. తొలి రోజున ఉదయం ఆటగాళ్లతో పరిచయం చేసుకున్న ఆయన రెండు గంటలపాటు ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించారు. వచ్చే నెలలో మలేసియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్ కోసం భారత్ సిద్ధమవుతోంది. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ద్వారా నియమితుడైన 54 ఏళ్ల పాల్ కాంట్రాక్ట్ 2018 ప్రపంచకప్ వరకు ఉంది. క్రీడాకారుడిగా చెప్పుకోతగ్గ చరిత్రలేని పాల్ కోచ్‌గా నెదర్లాండ్స్ జట్టుకు 2012 లండన్ ఒలింపిక్స్‌కు రజత పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. -
భారత హాకీ జట్టు కొత్త కోచ్‌గా పాల్ వాన్ యాస్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా నెదర్లాండ్స్ మాజీ కోచ్ పాల్ వాన్ యాస్‌ను... మహిళల టీమ్‌కు ఆంథోని థోర్న్టన్ (న్యూజిలాండ్)ను ఎంపిక చేశారు. టెర్రీ వాల్ష్, నీల్ హావ్‌గుడ్ స్థానంలో ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకుంటారు. మూడేళ్ల పాటు (2018) ఈ ఇద్దరు కాంట్రాక్ట్‌లో ఉండనున్నారు. ఆటగాడిగా వాన్ యాస్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువగా ఉన్నా... కోచ్‌గా నెదర్లాండ్స్ జట్టుకు లండన్ ఒలింపిక్స్‌లో రజతం అందించారు. ఇక నాలుగేళ్ల నుంచి ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న థోర్న్టన్ బార్సిలోనా ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.