వెళ్లగొట్టారు...! | Indian chief coach Paul van Ass removed from Hockey India | Sakshi
Sakshi News home page

వెళ్లగొట్టారు...!

Published Tue, Jul 21 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

వెళ్లగొట్టారు...!

వెళ్లగొట్టారు...!

భారత చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్‌ను తొలగించిన హాకీ ఇండియా
- అధ్యక్షుడు నరీందర్ బాత్రాతో విభేదాలే కారణం!
- రియో ఒలింపిక్స్ సన్నాహకాలపై ప్రభావం
న్యూఢిల్లీ:
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ఏడాది ముందు భారత హాకీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు నెలల క్రితమే చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాల్ వాన్ యాస్‌పై హాకీ ఇండియా వేటు వేసింది. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వాన్ యాస్‌కు జట్టుతో మూడేళ్ల ఒప్పందం ఉంది. 2018 పురుషుల హాకీ ప్రపంచకప్ వరకు ఆయన కొనసాగాల్సి ఉంది.

ఆదివారం షిలరూలోని సాయ్ సెంటర్‌లో హాకీ జట్టు శిబిరం ప్రారంభం కాగా కోచ్ హాజరు కాలేదు. అప్పుడే ఆయన భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే హాకీ వరల్డ్ లీగ్ సెమీస్‌లో జట్టు ప్రదర్శనపై కూడా ఆయన నివేదిక సమర్పించలేదు.  మరో కథనం ప్రకారం హాకీ వరల్డ్ లీగ్‌లో మలేసియాతో జరిగిన క్వార్టర్స్ అనంతరం హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో మాట్లాడాడు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోచ్ వాన్ ఆయనపై వాదనకు దిగారు.

కోచ్‌గా తానుండగా ఆటగాళ్లతో మీరు మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తూ.. వెంటనే మైదానం వీడాలని సూచించారు. అప్పటినుంచే హెచ్‌ఐ అధ్యక్షుడితో దూరం పెరిగినట్టు సమాచారం. నిజానికి హాకీ జట్టుకు విదేశీ కోచ్‌లు అచ్చిరావడం లేదనే చెప్పుకోవచ్చు. గతంలో గెరార్డ్ రాచ్, జోస్ బ్రాసా, మైకేల్ నాబ్స్, టెర్రీ వాల్ష్ కూడా ఏదో ఒక రీతిన జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలపై మాజీ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాల్ వాన్‌ను తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
 
‘మా ఆటపై ప్రభావం పడుతుంది’: మరోవైపు ఇలా చీటికిమాటికి కోచ్‌లను మారుస్తూ ఉంటే తమ ఆటపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఓ సీనియర్ ఆటగాడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా తమ ఒలింపిక్స్ సన్నాహకాలను దెబ్బతీస్తుందని అన్నాడు. ఏ కోచ్‌తోనైనా సమన్వయం అయ్యేందుకు కాస్త సమయం పడుతుందని, మరో ఏడాదిలో రియో ఒలిం పిక్స్ ఉండగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం అయోమయంగా ఉందని చెప్పాడు.
 
నన్ను షూట్ చేశారు: వాన్ ఆస్
కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ముందే అంచనా వేశానని హాలెండ్‌కు చెందిన పాల్ వాన్ యాస్ తెలిపారు. ఓరకంగా హాకీ ఇండియా తనను షూట్ చేసిందని ఆరోపించారు. ‘నాకు తెలిసినంత వరకు హాకీ వరల్డ్ లీగ్ సెమీస్ ముగిసిన వారం అనంతరమే నాపై ఫైరింగ్ జరిగింది. జట్టు హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలంట్ ఓల్టమన్స్‌కు నన్ను రీప్లేస్ చేయమని సూచించారు. నన్ను కోచ్‌గా నియమించడం బాత్రాకు నచ్చలేదని అప్పట్లోనే రోలంట్ నాకు చెప్పారు. ఉద్వాసన గురించి కూడా ఆయనే నాకు చెప్పారు.

హెచ్‌ఐ నుంచి ఎలాంటి లేఖ అందలేదు. దీనికి బాత్రాతో జరిగిన గొడవే కారణం. ఆరోజు క్వార్టర్స్ ముగిశాక బాత్రా మైదానంలోకి వచ్చి హిందీలో ఆటగాళ్లతో మాట్లాడాడు. వారిని ప్రశంసిస్తున్నాడేమో అనుకున్నా. కానీ ఆయన వారిని విమర్శిస్తున్నారు. అందుకే నేను జోక్యం చేసుకున్నాను. మైదానం నా ఏరియా. ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాపై ఉంది. మేం ఆ రోజు బాగా ఆడి గెలిచామనే అభిప్రాయంతో నేనున్నాను. తిరిగి బాధ్యతలు తీసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కోచ్ పద వి నుంచి నేను తప్పుకోవడం లేదు. వారే బయటికి పంపిస్తున్నారు’ అని వాన్ యాస్ స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement