సెల్ఫీ ప్రయత్నంలోనే.. ఐదుగురు పిల్లల మృతి | a trial for selfie lead to death of five students in dharmasagar reservoir | Sakshi
Sakshi News home page

సెల్ఫీ ప్రయత్నంలోనే.. ఐదుగురు పిల్లల మృతి

Published Sat, Sep 17 2016 5:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

సెల్ఫీ ప్రయత్నంలోనే.. ఐదుగురు పిల్లల మృతి

సెల్ఫీ ప్రయత్నంలోనే.. ఐదుగురు పిల్లల మృతి

ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి చనిపోయిన విద్యార్థుల విషయంలో సరికొత్త వాస్తవం బయటపడింది. కేవలం సెల్ఫీ తీసుకోవాలనే సరదాతోనే అక్కడివరకు వెళ్లారని.. దానివల్లే ఐదుగురు మరణించారని తెలుస్తోంది. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సరదాగా కబుర్లు చెప్పుకుందామని కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్‌కు వెళ్లారు. అక్కడ కూడా వాళ్లు పర్యాటకులు సాధారణంగా వెళ్లే ప్రాంతానికి కాకుండా అక్కడి నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రాంతానికి వెళ్లారు. కాసేపు అంతా కబుర్లు చెప్పుకున్న తర్వాత.. వాళ్లలో ఒక అమ్మాయి అందరితో కలిసి సెల్ఫీ తీసుకుందామని అక్కడున్న బండరాయి మీద కాలు పెట్టి, వెనకాల అందరినీ ఉండమని చెప్పి ఫొటో తీసుకోబోయింది. అయితే ఆ రాయి బాగా పాకుడు పట్టి ఉండటం, ఆమె పైన ఫోనువైపు చూస్తుండటంతో కాలు జారి పడిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న రాళ్లన్నింటికీ కూడా బాగా పాకుడు పట్టి ఉండటంతో.. ఆమె లోపలకు జారిపోయింది.

ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మిగిలిన విద్యార్థులు కూడా అలాగే జారి పడిపోయారు. వాళ్ల అరుపులు అక్కడున్నవారికి వినిపించినా, కేవలం ప్రత్యూష అనే ఒక్క అమ్మాయిని మాత్రమే కాపాడగలిగారు. కేవలం సెల్ఫీ ప్రయత్నమే ఈ ఐదుగురిని పొట్టన పెట్టుకుందని అక్కడున్నవాళ్లు చెప్పారు. వీళ్లంతా సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. అందరూ చాలా తెలివైన వాళ్లని అంటున్నారు. వీళ్లలో ఇద్దరు విద్యార్థులు అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని అనుకుంటున్నారు. మృతుల్లో ఇద్దరు అన్నా చెల్లెళ్లు కూడా ఉండటంతో వాళ్ల తల్లిదండ్రుల రోదనను ఎవరూ పట్టలేకపోతున్నారు. అందరి తలలకు గాయాలు కనిపిస్తున్నాయి. బండరాళ్ల మీద పడిపోవడంతో తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ధర్మసాగర్ రిజర్వాయర్‌ను కేవలం దూరం నుంచి చూడాలి తప్ప.. లోపలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. అయినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మధ్యాహ్నమే వస్తామని చెప్పిన పిల్లలు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు భోరుమంటున్నారు.

 

Advertisement

పోల్

Advertisement