నివేదికలో నిందితులు ఎవరో? | Abusers who report CDMA Apartment crash | Sakshi
Sakshi News home page

నివేదికలో నిందితులు ఎవరో?

Published Tue, Aug 26 2014 12:12 AM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

నివేదికలో నిందితులు ఎవరో? - Sakshi

నివేదికలో నిందితులు ఎవరో?

చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై మౌళివాక్కంలోని అపార్టుమెంటు కూలిన ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ సోమవారం తన నివేదికను సీఎం జయలలితకు సమర్పించింది. దీంతో నివేదికలో పేర్కొన్న నిందితులు ఎవరోనన్న ఉత్కంఠకు తెరలేచింది. చెన్నై పోరూరు మౌళివాక్కంలో 11 అంతస్తుల అపార్టుమెంటు జూన్ 28న కుప్పకూలిపోయింది. అపార్టుమెంటు శిథిలాల కింద 61 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణ దశలోనే భారీ అపార్టుమెంటు నిలువునా కూలిపోవడం, భారీ సంఖ్యలో ప్రాణ నష్టం ఏర్పడటం రాష్ట్రాన్నే కుదిపివేసింది. అపార్టుమెంటుకు చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) అధికారులు ఇచ్చిన అనుమతులపై విమర్శలు వెల్లువెత్తాయి. భారీ వర్షానికే కూలిపోయేంతటి లోపభూయిష్ట నిర్మాణమా అంటూ భవన నిర్మాణ సంస్థపై ఆగ్రహాలు పెల్లుబికాయి. ప్రజలు రెచ్చిపోవడాన్ని గమనించిన ప్రభుత్వం వెంటనే అపార్టుమెంటు యజమాని, ఇంజనీర్లు సహా ఏడుగురిని అరెస్ట్ చేసింది.
 
 ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిందితులు ఎవరో తేల్చాలని కోరుతూ రిటైర్డు న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను జూలై 3న సీఎం జయలలిత నియమించారు. ఇప్పటికే అనేక కమిషన్లను నిర్వహిస్తున్న రఘుపతికి మరో బాధ్యత అప్పగించడంపై డీఎంకే కోశాధికారి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జయలలిత కనుసన్నల్లో మెలిగే రిటైర్డు న్యాయమూర్తి రఘుపతి నాయకత్వంలో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో స్టాలిన్ పిటిషన్ దాఖలు చేశారు.
 
 గతంలో నీటికుంట ఉన్న ప్రాంతంలో 11 అంతస్తుల భారీ అపార్టుమెంటు నిర్మాణానికి అనుమతులు ఎలా మంజూరు చేశారంటూ సీఎండీఏ అధికారులపై కొందరు మండిపడ్డారు. అనుమతుల మంజూరులో తప్పిదం లేదు, నిర్మాణంలో నాణ్యత లేమికి అధికారులు బాధ్యత వహించాలని ప్రభుత్వం సీఎండీఏ అధికారులను వెనకేసుకు వచ్చింది. జూలై 11న ఏకసభ్య కమిషన్ సంఘటనా స్థలాన్ని సందర్శించడం ద్వారా విచారణను ప్రారంభించింది. సీఎండీఏ అనుమతులను సైతం పరిశీలించనున్నట్లు ఏకసభ్య కమిషన్ ప్రకటించింది. ఇలా అనేక వివాదాలు, విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకూ ఏకసభ్య కమిషన్ తన విచారణను పూర్తిచేసింది. రిటైర్డు న్యాయమూర్తి రఘుపతి సోమవారం మధ్యాహ్నం చెన్నై సచివాలయంలో సీఎం జయలలితను కలిసి నివేదికను సమర్పించారు.
 
 మరో అపార్టుమెంటు మాటేమిటి?
 కుప్పకూలిన అపార్టుమెంటు పక్కనే మరో 11 అంతస్తుల అపార్టుమెంటు ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండో దాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండో అపార్టుమెంటు నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నందున కూల్చివేయాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఆ పరిసర ప్రాంతాల ఇళ్లను ఖాళీ చేయించారు. ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తికాగానే రెండు అపార్టుమెంట్ల కూల్చివేతపై తేదీ ఖరారు అవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండో అపార్టుమెంటు ఎక్కడ కూలుతుందోనని మౌళివాక్కం ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంతకూ రెండో అపార్టుమెంటును స్వచ్ఛందంగా కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారా? మొదటి అపార్టుమెంటు ప్రమాదానికి అసలైన కారకులు ఎవరు? ఇందులో అధికారుల పాత్ర  ఏమైనా ఉందా? అనే అనుమానాలు ప్రజల మెదళ్లను తొలచివేస్తున్నాయి. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక వివరాలను త్వరలో ప్రభుత్వమే వెల్లడి చేస్తుందని ఎదురుచూస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement