మనసున మనసై.. | disabled people marriages | Sakshi
Sakshi News home page

మనసున మనసై..

Published Mon, Aug 24 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

మనసున మనసై..

మనసున మనసై..

‘ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడు’ అనేది
 నాటికీ నేటికీ ఎవర్‌గ్రీన్ నానుడి.
 అన్ని విధాల అనుకూలమైన సంబంధం చూసి
 పెళ్లి చేయడం రోజురోజుకూ కష్టసాధ్యం అయిపోతోంది.
 సకలాంగుల వివాహాలే సవాల్‌గా మారిపోయిన తరుణంలో
 వికలాంగులు వివాహం మాటేమిటనే  ప్రశ్నకు చెన్నైలోని
 గీతాభవన్ ట్రస్ట్ సగర్వమైన సమాధానంగా నిలిచింది.

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:   జీవితంలో వివాహం కేవలం ఓ ముచ్చటేకాదు, ఒక ఆనందకరమైన బాధ్యత. మనిషి జీవితాన్ని వివాహాత్పూర్వం, వివాహానంతరంగా విభజించవచ్చు. మనిషి జీవితంలోని కీలకమైన మలుపుల్లో ఎక్కువ శాతం వైవాహిక జీవితంతో సంక్రమించేవే. ఏకాకిగా ఉండే ఒక వ్యక్తి సామూహిక శక్తిగా ఎదగడం భార్య, పిల్లలు, మనవ ళ్లు, మనవరాండ్రలతోనే సాధ్యం. జీవితంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన  వైవాహిక జీవితానికి నోచుకోక  అంగవైకల్యాలతో వ్యథ భరిత జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రత్యేక ప్రతిభావంతులను గీతాభవన్ ట్రస్ట్ అక్కున చేర్చుకుంటోంది. ప్రత్యేక ప్రతిభావంతుల కోసమే ప్రత్యేకంగా 2010 నుంచి స్వయంవరాన్ని నిర్వహిస్తూ గత ఐదేళ్ల కాలంలో 248 జంటలకు అంగరంగ వైభవంగా ఉచితంగా వివాహాలు చేసింది.
 
 ఆరో విడతలో అనేక జంటలు:
 ఇదిలా ఉండగా, ఆరోవిడత ప్రత్యేక ప్రతిభావంతుల స్వయంవరం గీతాభవన్ ట్రస్ట్ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతిభావంతులశాఖ కమిషనర్ డాక్టర్ కే మణివణ్ణన్ ముఖ్యఅతిథిగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆర్కే చటర్జీ ప్రత్యేక అతిథిగా హాజరై స్వయంవరాన్ని ప్రారంభించారు. తమిళనాడు, పుదుచ్చేరీల నుంచే గాక ఆంధ్రప్రదేశ్ వైఎస్‌ఆర్ జిల్లా నుంచి కూడా యువతీ యువకులు హాజరైనారు. మూగ, చెవుడు, పోలియో వ్యాధిగ్రస్తులు, ఏమాత్రం నడువలేని వారు, రెండు చేతులూ లేని వ్యక్తి, మానసిక  వికలాంగులు ఇలా ఎందరో స్వయంవరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపై నుంచి తనను తాను పరిచయం చేసుకుని, తాను ఎటువంటి జీవిత భాగస్వామిని ఆశిస్తున్నానో చెప్పుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే కొన్ని జంటలు తామిద్దరం వివాహం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని వేదికపై నుంచే ప్రకటించారు. ఎవరిని ఎందుకు ఇష్టపడ్డారో వివరిస్తూ ముసిముసి నవ్వులతో వారి అంతరంగాన్ని ఆవిష్కరించారు. పెళ్లి అనే పదాలకు తావులేదని నిరాశ లో మునిగిపోయిన తరుణంలో గీతాభవన్ ట్రస్ట్ తమ జీవితాల్లో వసంతాన్ని నింపిందని ప్రతి జంట కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
 
 యువతుల సంఖ్య పెరగడం శుభపరిణామం:
 ప్రత్యేక ప్రతిభావంతులకు సేవ చేసే భాగ్యం కలగడం మా అదృష్టం. ఏ కారణం చేతలో యువతులు పెద్ద సంఖ్యలో ముందుకు రాకపోవడం వల్ల యువకులు నిలిచిపోతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది యువతులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఆదివారం నాటి స్వయంవరానికి 162 మంది యువకులు, 55 మంది యువతులు హాజరైనారు. చెన్నైతోపాటు అనేక జిల్లాల్లో క్యాంపులు పెట్టి స్వయంవరాలు నిర్వహిస్తుండగా ఆదివారం సాయంత్రానికి 67 జంటలు వివాహానికి సిద్ధమయ్యారు. ప్రతి ఏటా 60 మందికి వివాహాలు చేయాలని సంకల్పించగా, వధూవరుల నిర్ణయం అయిన పక్షంలో 200 వివాహాలు సైతం జరిపేందుకు సిద్ధం. అయితే వీరందరికీ అక్టోబర్ 4వ తేదీన ట్రస్ట్ నిర్వహించే కౌన్సెలింగ్‌లో ఉత్తీర్ణులైన తరువాతనే  తమ సమక్షంలో వివాహం చేసుకునే అవకాశం కల్పిస్తాం. ఎంపికైన జంటలకు డిశంబర్ 3వ తేదీన సకల లాంఛనలతో ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తాం. కాపురానికి అవసరమయ్యే రూ.లక్ష విలువైన వస్తు సామగ్రిని వధూవరులకు ఉచితంగా అందజేస్తాం.        అశోక్ గోయల్, మేనేజింగ్ ట్రస్టీ, గీతాభవన్ ట్రస్ట్
 

Advertisement
Advertisement