ఈ–నామ్‌పై అయోమయం | e-NAM purchases in jammikunta market | Sakshi
Sakshi News home page

ఈ–నామ్‌పై అయోమయం

Published Sat, Oct 22 2016 2:46 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

e-NAM purchases in jammikunta market

కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో తొలగని ప్రతిష్టంబన
ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ససేమిరా అంటున్న వ్యాపారులు
ఈనెల 24 నుంచి పత్తి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు ఆదేశం
జమ్మికుంట పత్తి మార్కెట్‌లో అరకొర ఏర్పాట్లు


కరీంనగర్‌ అగ్రికల్చర్‌/జమ్మికుంట : కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఈ–నామ్‌ విధానంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ–నామ్‌ విధానంలో మాత్రమే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ససేమిరా అంటున్నారు. అక్టోబర్‌ మొదటి వారం నుంచి కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లోని ఎనిమిది అడ్తీదుకాణాల్లో వ్యాపారులు కొనుగోళ్లు చేపడతున్నారు. ఈ–నామ్‌లో ప్రతీ లాట్‌ను పరిశీలించి వివరాలను నమోదు చేసుకోవడం, కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేపట్టడం తమ వల్ల కాదంటున్నారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు ఎన్నిసార్లు అవగాహన సదస్సులు నిర్వహించినా వ్యాపారులు ససేమిరా అంటున్నారు. మార్కెట్‌ కార్యాలయంలో వ్యాపారుల కోసం గదులు కేటాయించి కంప్యూర్లు ఏర్పాటు చేశారు. అధికారులు ఒత్తిడి చేస్తున్న ఫలితంగా కొద్ది మొత్తంలో వస్తున్న వడ్లు, మొక్కజొన్నలను కొంతమంది మాత్రమే ఈ–నామ్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కూడా సిండికేట్‌ అయి నాణ్యత లేదంటూ తక్కువ ధరకే టెండర్‌ కోట్‌ చేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌కు 296 క్వింటాళ్ల వడ్లు, 328 క్వింటాళ్ల మక్కలు, 1001 క్వింటాళ్ల పత్తి వచ్చింది. పత్తికి మద్దతు ధర కన్నా ఎక్కువగానే చెల్లించినప్పటికీ.. అందులో జిమ్మిక్కులకు పాల్పడుతూ రైతులను ముంచుతున్నారు. అమ్మకానికి తెచ్చిన పత్తిని, ధ్యాన్యాన్ని మార్కెట్‌లో ఉంచలేక, ఇంటికి తీసుకెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఆన్‌లైన్‌లోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డీఎంవో పద్మావతి ఆదేశించారు. అందుకు నిరాకరించిన వ్యాపారులు కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించి కార్యాలయంలో ఆందోళనకు దిగారు. వేలంపాటలోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో ఎక్కువ మంది వ్యాపారులు పోటీ పడటం వల్ల గిట్టుబాటు ధర లభిస్తుందని డీఎంవో పద్మావతి రైతులకు వివరించారు. నామ్‌ విధానంపై అవగాహన పెంచుకోవాలని రైతులకు, వ్యాపారులకు సూచించారు. ఈ నెల 24 నుంచి పత్తి కొనుగోళ్లను నామ్‌ విధానంలోనే చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.

జమ్మికుంటలో 24 నుంచి ఈ–నామ్‌
జమ్మికుంట మార్కెట్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌
కాటన్‌ వ్యాపారులకు మార్కెట్‌ కార్యదర్శి ఆదేశం


జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం నుంచి ఈ–నామ్‌ విధానంలోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని మార్కెట్‌ కార్యదర్శి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మార్కెట్‌ చైర్మన్‌లో ఆయన కాటన్‌ వ్యాపారులు. కమీషన్‌ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఈ–నామ్‌ విధానంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.  

నామ్‌ కొనుగోళ్లు ఇలా...
రైతులు ఉదయం 9గంటలకే మార్కెట్‌కు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చిన పత్తి వాహనాలను లోనికి అనుమతించరు. గేటు వద్దనే రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా, ఫోన్‌ నంబరు, కమీషన్‌ ఏజెంట్, సరుకు రకం, బస్తాల సంఖ్య, వాహనం నంబర్‌ తదితర వివరాలు నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా నామ్‌ టోకెన్‌ నంబర్‌ జారీ చేస్తారు. తద్వారా వ్యాపారులు నాణ్యతను చూసుకొని కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌లో ధరలు కోట్‌ చేస్తారు. ఇప్పటికే వ్యాపారులకు యూజర్‌ ఐడీ, పాస్‌వార్డు నంబర్లు మార్కెట్‌ అధికారులు కేటాయించారు. ధరలు కోట్‌ చేసిన తర్వాత గడువు అనంతరం ఏ వాహనానికి ఏ వ్యాపారి ఎంత ధర కేటాయించాడో మార్కెట్‌ అధికారులు డిస్‌ప్లే ద్వారా అందరికీ కనిపించే విధంగా ప్రదర్శిస్తారు.

తూకం, చెల్లింపులు పాత పద్ధతిలోనే..!
రైతుల ఉత్పత్తులను గేట్‌ వద్ద నమోదు చేయడం, వ్యాపారులు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ నిర్వహించడం వరకే ఈ–నామ్‌ విధానం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ యంత్రాల ద్వారా తూకం వేయడం, ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేయడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది.

ఈ–నామ్‌ సాధ్యమేనా?
పత్తి కొనుగోళ్లలో ఈ–నామ్‌ విధానం సాధ్యమవుతుందా అనే చర్చ వ్యాపార వర్గాల్లో వినిపిస్తోంది. రైతులు తీసుకొచ్చే ఉత్పత్తులకు ఎవ రు గ్రేడింగ్‌ వేస్తారు, నాణ్యతను ఎలా గుర్తిస్తారనే సందేహాలు నెలకొన్నాయి. పైన నాణ్యత, లోపల నాసిరకం పత్తి అమ్మకానికి వచ్చిన సమయంలో వ్యాపారులు ఎలా ఆన్‌లైన్‌లో ధరలు కోట్‌ చేస్తారనేది ప్రశ్నగా మారింది. కొత్త విధానంతో ఎలాంటి ధరలు పలుకుతాయోనని రైతుల్లోనూ ఆసక్తి నెలకొంది.

శుక్రవారం కరీంనగర్‌ మార్కెట్‌కొచ్చిన ఉత్పత్తులు, ధరలు

పంట        మద్దతుధర      గరిష్టం    మోడల్‌    కనిష్టం
ధాన్యం          1510         1385      1360      1350
మొక్కజొన్న   1365         1411      1370      1330
పత్తి              4060          5210      5050     4000
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement